మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు మొత్తం, లక్ష ద్వీప ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు, కొమోరిన్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండి తెలిపింది. తాజా వాతావరణ సూచనల ప్రకారం దక్షిణ అరేబియా సముద్రం మీద తక్కువ ఎత్తులో పశ్చిమ గాలులు బలపడి లోతుగా విస్తరించాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం కేరళ తీరం, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అరేబియా సముద్రం ప్రాంతంలో ఇది ఎక్కువగా మేఘావృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని కారణంగా రాగల 2, 3 రోజుల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్ష ద్వీప ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడిందని అధికారులు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రానున్న మూడు రోజుల పాటు ఎపి, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులు గంటకు 40- నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.