దేశంలోని కోట్లాది నిరుపేద ప్రజలను ఆదుకొంటున్న లక్షలాది ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జివొ)లు ప్రధాని మోడీ ప్రభుత్వంలో చెప్పనలవికానంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు అణగారిన వర్గాలకు లభించేలా చేయడంలో ఎన్‌జివొలు చేస్తున్న కృషి గణనీయమైనది. ఈ విషయంలో ప్రభుత్వ బాధ్యతా రాహిత్యాన్ని న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లడంలో పాలకులపట్ల అంకుశంలా పనిచేసి తగు న్యాయం లభించేలా చూస్తున్నాయి. పేదలను అక్షరాస్యులను, చైతన్యవంతులను చేస్తున్నాయి. పర్యావరణ నష్టాలను అరికట్టడంలో గణనీయమైన కృషి సాగిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలలో బాధితులను ఆదుకోడం, పునర్ నిర్మాణ పనుల్లో సహకరించడం తదితర ఘనతర బాధ్యతలు చేపడుతున్నాయి. పేదలపట్ల ప్రభుత్వం సవ్యంగా స్పందించని చోట్ల ఆ ఖాళీని పూరిస్తున్నాయి. ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వ విధానాలను ఎదిరించడం, వ్యవస్థాగత లోపాలను సవరింపజేయడం దళితులు, ఆదివాసీలు, ఇతర హక్కుమాలిన వర్గాల పక్షాన వకల్తా పుచ్చుకొని వారికి మేలు జరిగేలా చూడడం వంటి మహత్తర మానవీయ కృషికి అంకితమైన ఎన్‌జివొలు దేశంలో 34 లక్షల వరకు ఉన్నట్టు సమాచారం.
ఈ సంస్థలకు ప్రధాన ఆర్ధిక వనరు విదేశీ విరాళాలు, బయటి నుంచి వచ్చే ఆర్ధిక సాయంతో ఇక్కడ కార్యాలయాలను, కార్యకర్తలను ఏర్పాటు చేసుకొని అందుకు సంబంధించిన పనులు విజయవంతంగా జరుపుతున్నాయి. ఎన్‌జివొలు తమకు ఆటంకంగా తయారయ్యాయని భావించి మన కేంద్ర ప్రభుత్వాలు వాటి మూలాలను బలహీన పరుస్తున్నాయి. విదేశీ వనరులు అందుకొనే దారులను మూసివేస్తున్నాయి. 1976లో వునికిలోకి వచ్చిన విదేశీ విరాళాల చట్టాన్ని కఠినతరం చేయడం మొదలు పెట్టాయి. దేశంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని చెప్పి బయటనుంచి నిధుల రాకడను నిరోధిస్తున్నాయి. ఈ దిశగా 2010లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ చట్టానికి కఠిన సవరణలు తెచ్చింది. రాజకీయ లక్షణాలున్న సంస్థలు విదేశీ విరాళాల స్వీకరణకు అర్హం కావంటూ వొక సవరణ తీసుకొచ్చింది. ప్రధాని మోడీ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తున్నది.
మతపరమైన వ్యతిరేకతతో కూడా ఈ సంస్థలపై ప్రధాని మోడీ ప్రభుత్వం వుక్కు పాదం మోపుతున్నదనే అభిప్రాయం నెలకొని వుంది. ఎన్‌జివొలు దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదకరమనే దృష్టితో నిర్ణయాలు తీసుకొంటున్నది. దేశ స్థూల వృద్ధి రేటు యేటా 2.3 శాతం కుదించుకు పోడానికి గ్రీన్ పీస్, కోర్డ్ ఎయిడ్, ఆమ్నెస్టీ, యాక్షన్ ఎయిడ్ వంటి సంస్థలు కారణమని ఆరోపించిన నిఘా విభాగ రహస్యపత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో బయటపడింది. విదేశీ విరాళాల చట్టం ద్వారా నిధులు పొందుతున్న దాదాపు 20,000 సంస్థల లైసెన్సులను 2018లో రద్దు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ ప్రజారోగ్య విధానానికి సంబంధించి నిపుణతల కలిగిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దళితల హక్కుల పరిరక్షణ కోసం పని చేసే నవ్ సర్జన్ వంటి సంస్థల లైసెన్సులను కూడా రద్దు చేశారు. 2015లో గ్రీన్ పీస్‌కు చెందిన ప్రియా పిళ్లే బ్రిటన్‌లో సమావేశానికి వెళుతుండగా విమానంలోంచి దింపివేసి వెనక్కు రప్పించారు.
2018లో అనేక మంది ఎన్‌జివొ కార్యకర్తలను మావోయిస్టులనే ఆరోపణతో అరెస్టు చేశారు. ఇందులో ఇటీవల విడుదలైన సుధా భరద్వాజ్ కూడా వున్నారు.ఈమె చత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లో వారి హక్కుల కోసం పోరాటం చేసిన చత్తీస్‌గఢ్ పీపుల్స్ యూనియన్ పర్ సివిల్ లిబర్టీస్ సంస్థ ప్రధాన కార్యదర్శి. ఈ విధంగా కేంద్రంలోని పాలకుల సిద్ధాంతాలను వ్యతిరేకించేవారిని అటవీ ప్రాంతా ల్లో ఆదివాసీల జీవన విధ్వంసాన్ని ఆపడంలో ప్రభుత్వంతో పోరాడుతున్నవారిని అణచివేయడానికి వారు పని చేస్తున్న ఎన్‌జివొ సంస్థలపై ప్రధాని మోడీ ప్రభుత్వం గురి పెట్టి తీవ్రమైన నిర్ణయాలు తీసుకొంటున్నది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తింది, మరి కొన్ని వేల (22,000కి పైగా) ఎన్‌జివొల అనుమతులపై, లైసెన్స్‌లపై వేటు పడవచ్చునని భావిస్తున్నారు. అయిదు వేల మందికి పైగా క్రైస్తవ సిస్టర్స్‌ను కలిగి దేశమంతటా విస్తరించి విశిష్టమైన సేవలందిస్తున్న మైనారిటీస్ ఆఫ్ చారిటీకి కూడా కేంద్రం అనుమతిని నిలిపివేసింది. ఈ సంస్థను 1950 లో శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరెస్సా నెలకొల్పారు. సంవత్సరాంతంలో లైసెన్స్‌లు పొందవలసిన గడువు పూర్తి అవుతుండగా వేలాది ఎన్‌జివొలు ఆందోళనకు గురి కావడం దేశంలోని కోట్లాది నిరుపేద ప్రజానీకానికి పిడుగుపాటు వంటి పరిణామం. మెరుగైన జీవన వాతావరణాన్ని సృష్టింపజేయడంలో తలమునకలైన ఎన్‌జివొల మెడ మీద కత్తి వేయడమంటే అణగారిన వర్గాలను దిక్కు లేనివారిని చేయడమే.