మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులు చేపట్టవద్దని జాతీయ హరిత ట్రిబ్యునల్ పునరుద్ఘాటించింది. తెలంగాణ వినతిపై వివరణ ఇవ్వాలని కృష్ణాబోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణానదిపై ఎపి ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులపై మంగళవారం జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఎన్జిటి బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను విచారించిన ఎన్జిటి ఎత్తిపోతల పధకం పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది. పనులు జరుపుతున్నారంటూ ఎన్జిటికి పిటిషనర్ తెలపడంతో పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లవద్దని ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కృష్ణానదీ యాసమాన్య బోర్డుకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
రాయలసీమ ఎత్తిపోతల పనులపై క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు నిజనిర్ధారణ కమిటి వేయాలని పిటిషనర్ కోర్టుకు విజ్ణప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎన్జిటి బెంచ్ పిటిషనర్ వినతిపైకూడా వివరణ ఇవ్వాలని బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ 24కు వాయిదా వేస్తున్నట్టు ఎన్జిటి బెంచ్ ప్రకటించింది. అంతర్రాష్ట్ర జల ఒప్పందాలను ఉల్లంఘిస్తూ రాయల సీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం జలసంఘం కూడా ఇదివరకే హెచ్చరికలు చేసింది. ఎపి ప్రభుత్వం సమర్పించిన రాయల సీమ ఎత్తిపోతల పధకం డిపిఆర్‌లో అసలు ప్రాధమిక అంశాలేవి లేవని కేంద్ర జల్ శక్తి శాఖ పేర్కొంది. ఇప్పటికైన సిడబ్యుసి మార్గదర్శకాలను పాటిస్తూ డిపిఆర్‌ను మళ్లీ రూపొందించి అందచేయాలని గతంలోనే కేంద్రం ఆదేశించిందని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.
NGT hearing Rayalaseema lift Irrigation works