Thursday, January 23, 2025

యూపీ పోలీసులకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్‌రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను పోలీసులు ఎస్కార్ట్‌తో తీసుకువెళుతుండగా హత్యకు గురికావడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి), ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనర్‌కు ఇచ్చిన నోటీసులో నాలుగు వారాల్లోగా నివేదికలు ఇవ్వాల్సిందిగా కమిషన్ కోరింది.

హత్యకు దారితీసిన అన్ని అంశాలు, మరణించిన వారి మెడికల్‌లీగల్ సర్టిఫికేట్ల కాపీలు, విచారణ నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక, వీడియో క్యాసెట్/పోస్ట్‌మార్టం పరీక్ష సిడి, నేరం జరిగిన ప్రదేశపు సైట్ ప్లాన్, మెజిస్టీరియల్ విచారణ నివేదికలో జోడించాలన్నారు. ప్రయాగ్‌రాజ్ మెడికల్ కాలేజ్‌కు శనివారం రాత్రి పోలీసుల ఎస్కార్ట్‌తో మెడికల్ చెకప్‌కు వెళుతున్న అహ్మద్, అష్రఫ్‌లను పాయింట్‌బ్లాంక్ రేంజ్ నుంచి జర్నలిస్టుల రూపంలో వచ్చిన కిరాతకులు కాల్చి చంపారు. వారిని ఉమేశ్ పాల్, అతడి ఇద్దరు సెక్యూర్టీ గార్డుల హత్య కేసులో గుజరాత్, బరేలి జైళ్ల నుంచి ప్రశ్నించేందుకు ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చారు. హత్యకు ముందు సోదరులిద్దరిని సంకెళ్లతో పోలీసులు కట్టివేసిన దృశ్యాలు కెమెరా మెన్‌లు రికార్డు చేశారు. తర్వాత ఆ వీడియోలు టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారం కూడా అయ్యాయి. ఈ కాల్పులకు కొద్ది సేపటి ముందే ఝాన్సీలో ఏప్రిల్ 13న పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన అహ్మద్ కుమారుడైన అసద్ అంత్యక్రియలు జరిగాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News