న్యూఢిల్లీ: కల్లకురిచి జిల్లాలోసంభవించిన కల్తీసారా దుర్ఘటనపై తమిళనాడు ప్రభుత్వానికి, పోలీసు చీఫ్‌కు నోటీసులు జారీచేసినట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సి) మంగళవారం తెలిపింది. వారం రోజుల్లోగా నివేదిక అందచేయాలని ఆదేశించినట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సి తెలిపింది. కల్లకురిచిలో జరిగిన కల్తీసారా దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 58కి చేరుకుంది.
వివిధ ఆసుపత్రులలో దాదాపు 219 మంది చికిత్స పొందుతున్నారు. కల్లకురిచిలో కల్తీసారా తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు పత్రికా వార్తలు చూసి తాము సుమోటోగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఒక ప్రకటనలో పేర్కొంది. మహిళలతోసహా అనేక మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పత్రికా వార్తలు తెలియచేశాయి.
ఈ వార్తలే నిజమైన పక్షంలో ఇది ప్రజల జీవించే హక్కును ఉల్లంఘించడంగా పరిగణించాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఆర్‌సి తన ప్రకటనలో తెలిపింది. ప్రజల ప్రాణాలకు హాని కలిగించి సారా తయారీ, నిల్వ, రవాణా, కొనుగోలు, అమ్మకాలను నియంత్రించే అధికారం ప్రత్యేకంగా రాష్ట్రాలకే ఉంటుందని తెలిపింది. వారం రోజుల్లోగా సమగ్రమైన నివేదికను అందచేయాలని తమిళనాడు చీఫ్ సెక్రటరీ, డిజిపిలను ఆదేశిస్తూ నోటీసులు జారీచేసినట్లు ఎన్‌హెచ్‌ఆర్‌సి ప్రకటనలో వివరించింది.