న్యూఢిల్లీ : ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్‌స్టర్లకు బలమైన సంబంధాలు ఉన్నాయన్న కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో 60 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. పంజాబ్ లోని మూసేవాలా హత్యలో నిందితులుగా ఉన్న గోల్డీబ్రార్, జగ్గు భగవాన్ పురియా నివాసాలపై కూడా దాడులు చేపట్టింది. పంజాబ్‌లో పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ప్రమేయం ఉందని, ఆ డబ్బు తరువాత ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు అందుతోందన్న ఆరోపణలపై ఎన్‌ఐఎ కేసు దర్యాప్తు చేస్తోంది. యమునానగర్, మజిథా రోడ్, ముక్త్‌సర్, గుర్‌దాస్‌పూర్, గురుగ్రామ్ ల్లో దాడులు జరిగాయి. మూసేవాలా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పంజాబ్ పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. మూసేవాలా హత్యకేసులో ప్రధాన నిందితుడైన గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వాడు. ఈ హత్యకు తానే బాధ్యుడినని తరువాత ప్రకటించాడు. గురుగ్రామ్ లోని నహర్‌పూర్ రూపా గ్రామంలో సోమవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో కౌశల్ చౌదరి, అతని అత్యంత సన్నిహితులు అమిత్ డాగర్, సందీప్ ఇళ్లల్లో కూడా ఎన్‌ఐఎ దాడులు చేపట్టింది.