పిఎఫ్‌ఐపై నియా రిమాండ్‌రిపోర్టు
అగ్రనేతలపై దాడులకు వ్యూహం
లష్కరే ఐసిస్‌ల్లో చేరేందుకు ఒత్తిడి
కొచ్చి : ఉగ్రవాదం, నిధుల చేరవేత అభియోగాల ముద్రపడ్డ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్‌ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) పలు కీలక విషయాలను ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో తమ దాడులు , అరెస్టు అయిన ప్రముఖ నేతల దగ్గరి నుంచి అత్యంత అభ్యంతరకర, తీవ్రస్థాయి సమాచారం , కీలక పత్రాలు లభించాయని నియా తెలిపింది. ఈ మేరకు ఎన్‌ఐఎ ప్రత్యేక న్యాయస్థానానికి నియా రిమాండ్ రిపోర్టు అందించింది. కొచ్చిలో అరెస్టు అయిన పది మందిని తమ రిమాండ్‌కు పంపించాలని కోరుతూ నియా వర్గాలు కోర్టుకు అత్యంత కీలకమైన రిమాండ్ రిపోర్టును సమర్పించాయి. దేశంలోని ఓ నిర్ణీత వర్గానికి చెందిన ప్రముఖ నేతలపై దాడులు లక్షంగా చర్యలకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయని తెలిపారు. కొచ్చిలో పది మందిపై కేసు దాఖలు అయింది. వీరిని సరైన విధంగా విచారించాల్సి ఉంటుంది. ఇందుకు తమ కస్టడీకి కనీసం పది రోజులు అప్పగించాల్సి ఉందని డిమాండ్ చేశారు. అన్నింటికన్నా తీవ్రంగా ఈ రాడికల్ ఇస్లామిక్ సంస్థ యువత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా , ఐసిస్‌లలో చేరేందుకు పలు విధాలుగా ప్రలోభాలకు దిగిందని కూడా రిపోర్టులో తెలిపారు.
నియా ఈ నెల 22వ తేదీన రిపోర్టును పంపించింది. దేశంలోని ప్రధాన పదవులలో ఉన్న వారిని టార్గెట్ చేసుకోవడం, ఏదోవిధంగా దేశంలో ఇస్లామిక్ రాజ్యాన్ని నెలకొల్పడం , జిహాదీ చర్యల ద్వారా తీవ్రస్థాయి ఉగ్రవాద హింసాకాండకు పాల్పడటం వంటి అంశాలు ఈ పత్రాల ద్వారా తమ దృష్టికి వచ్చాయని వివరించారు. దేశంలో జరుగుతున్న సోదాల దశలో ఇప్పటికే వందకు పైగా అరెస్టులు జరిగాయి. కేరళనే ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ సంస్థ కార్యకలాపాలు సాగాయని పేర్కొన్న నియా కొచ్చిలో పది మందిని పట్టుకున్న విషయాన్ని ప్రస్తావించింది. ప్రత్యేకించి పిఎఫ్‌ఐకి భారతదేశం పట్ల తీవ్రస్థాయి వ్యతిరేక భావన ఏర్పడింది. ప్రభుత్వ విధానాలకు తప్పుడు అన్వయాలను సమకూర్చుకుని అపార్థాలతో విద్వేషాలను సంతరించుకుంది. సమాజంలోని ఓ వర్గంపై దాడులకు సంకల్పించింది. ప్రభుత్వానికి, అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా విద్వేషాలను రగిలించాలని వ్యూహరచనకు దిగిందని దొరికిన డాక్యుమెంట్లతో వెల్లడైందని నియా తెలిపింది. భారతదేశం పట్ల అసహనం, అంతకు మించి జుగుప్సాకర వైఖరిని సంతరించుకుందని పేర్కొన్నారు.
ఇక ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొన్న నిందితుల పూర్వాపరాలను పరిశీలించగా వారు వ్యవస్థీకృత నేరాల నిర్వహణలో దిట్ట అని తేలింది. తరచూ చట్టవ్యతిరేక చర్యలకు దిగుతూ ఇతర మతాల వారిని భయభ్రాంతులను చేసేందుకు ఘటనలు చేపట్టాలని సంకల్పించినట్లు అరెస్టు అయిన వారి నుంచి తమకు దొరికిన పత్రాలతో స్పష్టం అయిందని తెలిపారు. పిఎఫ్‌ఐ ఏకంగా ఓ హిట్‌లిస్టును సిద్ధం చేసుకుంది. దీనిని అమలు చేసేందుకు సంస్థకు చెందిన నేతలు, సభ్యులు , సంబంధిత సంస్థలు వ్యక్తులు సమాజంలో దారుణ చర్యలకు పాల్పడుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.