Wednesday, January 22, 2025

ఎపిలో ఆర్కె సతీమణి ఇంట్లో ఎన్‌ఐఎ సోదాలు

- Advertisement -
- Advertisement -

NIA searches house of RK's wife in AP

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అలకూరపాడులో మావోయిస్టు దివంగత నేత రామకృష్ణ అలియాస్ ఆర్‌కె సతీమణి శిరీష ఇంటిలో మంగళవారం ఉదయం చత్తీస్‌గడ్‌కు చెందిన ఎన్‌ఐఎ అధికారుల బృందం సోదాలు చేపట్టింది. అలాగే అలకూరపాడులోని శిరీష ఇంటితో పాటు విప్లవ రచయితల సంఘం నేత కల్యాణ్ రావు ఇంటిలోనూ ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. ఈక్రమంలో విజయవాడ అజిత్‌సింగ్ నగర్ లూనా సెంటర్‌లోని దొడ్డి ప్రభాకర్ ఇంటిలోనూ ఎన్‌ఐఎ అధికారులు సోదాలు చేపట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో ఆయా ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన ఎన్‌ఐఎ అధికారులు ఆ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు ఎన్‌ఎఎ అధికారులు పేర్కొంటున్నారు. కాగా మావోయిస్ట్ నేత ఆర్‌కె భార్య శిరీష అనారోగ్య కారణాలతో విజయవాడకు చికిత్స కోసం వెళ్లిన సమయంలో ఆమె ఇంటి తాళాలు పగలగొట్టి సోదాలు చేపట్టారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు.

అదేవిధంగా విజయవాడలో కూడా ఎన్‌ఐఎ అధికారులు తనిఖీలు చేపట్టారు. విరసం నేతలపై కొద్దిరోజుల క్రితం విశాఖ జిల్లా పెద్దబాయలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో చత్తీస్‌గడ్‌కు చెందిన ఎన్‌ఐఏ అధికారుల బృందం విజయవాడకు చేరుకుని సింగ్ నగర్‌లోని విరసం నేత దొడ్డి ప్రభాకర్ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ఎన్‌ఐఎ సోదాలపై ఆర్‌కె సతీమణి శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాల పేరిట ఎన్‌ఐఎ అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. భర్త మరణంతో బాధపడుతుంటే సోదాల పేరుతో వేధిస్తారా? అని ఆమె అధికారులను నిలదీశారు. అసలు తానేం నేరం చేశానో చెప్పాలని ఆమె వారిని ప్రశ్నించారు. నేరం చేసిన వాళ్లు నిర్భయంగా రోడ్లపై తిరుగుతుంటే.. ఏ నేరం చేయని తనను మహిళ అని కూడా చూడకుండా ఇబ్బంది పెడతారా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తెల్లవారు జామున 

విజయవాడ అజిత్‌సింగ్ నగర్ లూనా సెంటర్ లోని ఓ గృహంలో కూడా ఎన్‌ఎస్‌ఐఏ అధికారులు మంగళవారం తెల్లవారు జామున ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈక్రమలో ఛతీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన నలుగురు యువకులు అక్కడ ఏడాదిగా అద్దెకు ఉంటున్నట్లు ఎన్‌ఐఎ అధికారులకు విచారణలో తేలింది. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటిపై ఎస్‌ఐఏ అధికారుల బృందం దాడి చేసింది. ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులకు నగదు బదిలీలు జరిగినట్లు ఎస్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు సానుభూతిపరులు ఉన్న ఇంటి వద్దకు స్థానిక పోలీసులను ఎస్‌ఐఏ అధికారులు అనుమతించకపోవడంతో పాటు తనిఖీ వివరాలను ఎన్‌ఐఎ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News