Sunday, January 19, 2025

ఆపరేషన్ పిఎఫ్‌ఐ

- Advertisement -
- Advertisement -

ఏకకాలంలో 40 ప్రాంతాల్లో ఎన్‌ఐఎ సోదాలు

నిజామాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు ఎపిలో దాడులు

అదుపులోకి 26మంది,
నలుగురిపై కేసు
నమోదు
కీలక పత్రాలు, డిజిటల్
పరికరాలు స్వాధీనం
విదేశాల నుంచి నగదు
బదిలీ, బ్యాంకు ఖాతాల
లావాదేవీలపై ఆరా
సోదాల సమయంలో
అనుమానితులు
లేకపోవడంతో
కుటుంబసభ్యులతో
వివరాల సేకరణ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థలలో ఉగ్రమూలాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్‌ఐఎ అధికారులు తెలుగు రాష్ట్రాల్లోని ఆరుజిల్లాలలోని 40 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. యువతకు కరాటే శిక్షణ, లీగల్ అవేర్‌నెస్ ముసుగులో పిఎఫ్‌ఐ మతకలహాలను సృష్టిస్తోందని తెలుగు రాష్ట్రాలలో 26మందిని అదుపులోకి తీసుకుని వారిలో నలుగురిపై ఎన్‌ఐఎ కేసులు నమోదు చేసింది. ఈ తనిఖీలలో విదేశాల నుంచి నగదు బదిలీ, బ్యాంక్ ఖాతాల లావాదేవీలను ఎన్‌ఐఎ గుర్తించింది. తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, కడప, కర్నూలు, గుంటూరు జిల్లా ల్లో 60 ఎన్‌ఐఎ బృందాలు ఏకకాలంలో దాడులు చేపట్టాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 23 బృందాలతో ఎన్‌ఐఎ తనిఖీలు నిర్వహించగా కర్నూలు, కడప జిల్లాలతో పటు గుంటూరు జిల్లాలోనూ 2 బృందాలతో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించారు.

నిజామాబాద్‌లో 23 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేశామని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు,నంద్యాల,నెల్లూరు జిల్లాల్లో తనిఖీలు చేపట్టామని ఎన్‌ఐఎ అధికారులు వివరించారు. అవేర్‌నెస్ ముసుగులో మతకలహాలు సృష్టించేందుకు పిఎఫ్‌ఐ ఉగ్ర శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించిన అధికారులు తనిఖీలలో డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు, రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జులై 4న నలుగురు పిఎఫ్‌ఐ నేతలు అబ్దుల్లా ఖాదీర్, షేక్ స హదుల్లా, ఇంబ్రాన్, అబ్దుల్ మోబిన్‌లు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసుపై ఎన్‌ఐఎ దర్యాప్తును వేగవంతం చేసినట్లు ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు నిర్వహించిన సోదాలలో పలువురు అనుమానితుల ఇళ్లలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సూరారం సాయిబాబా నగర్ సూరారాం సాయిబాబనగర్ లోని పలు ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పిఎఫ్‌ఐ సంస్థలో సభ్యత్వం ఉన్న వ్యక్తి ని విచారించి పలు హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకుంది. అలాగే ఎపిలోని నంద్యాలలో పిఎఫ్‌ఐ కార్యకర్త యూనస్ అహ్మద్ ఇంట్లో సోదాలు నిర్వహించి డైరీతో పాటు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులలో 26 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఎ అధికారులు వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు. పిఎఫ్‌ఐ కరాటే శిక్షణ, లీగల్ అవేర్‌నెస్ ముసుగులో కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఎన్‌ఐఎ అధికారుల ప్రాధమిక విచారణలో తేలింది. దీంతో భైంసా అల్లర్లతో సంబంధాలపైనా ఎన్‌ఐఎ ఆరా తీయడంతో పాటు సోదాల సమయంలో అనుమానితులు ఇళ్లలో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.

అవేర్‌నెస్ ముసుగులో 

కరాటే శిక్షణ, లీగల్ అవేర్‌నెస్ ముసుగులో పిఎఫ్‌ఐ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఈ నేపథ్యంలో దేశంలో మతకలహాలు సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఐఎ గుర్తించింది. మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి, భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. వీరికి పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు ఈ కేసును ఎన్‌ఐఎకి అప్పగించారు.దీంతో నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లతో సంబంధాలపైనా ఎన్‌ఐఎ ఆరా తీయడంతో భైంసాలోని మదీనా కాలనీలోని పలు ఇళ్లలో దర్యాప్తు అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్‌లో సోదాల అనంతరం అక్కడ లభించిన సమాచారంతో ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. భైంసాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. టవర్ సర్కిల్‌లోని కేర్ మెడికల్ షాప్‌కు వచ్చి దుకాణం తాళాలు పగులకొడుతుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీంతో అధికారులు యజమానిని పిలిపించి తనిఖీ నిర్వహించారు.

దుకాణంలోని సిసి ఫుటేజిని పరిశీలించారు. వాటి సాయంతో మరికొందరి ఇళ్లలో సోదాలు జరిపారు. అనుమానితుల ఇళ్లలో అధికారులు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.నిజామాబాద్‌లో అబ్ధుల్ ఖాదీర్ నేతృత్వంలో మార్షల్ ఆరట్స్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి 200 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు గుర్తించారు. కేరళ, ఢిల్లీ, కర్ణాటకలతో కూడా పిఎఫ్‌ఎస్‌ఐ కార్యకలాపాలు ఉన్నట్లు ఎన్‌ఐఎ తెలిపింది. నిజామాబాద్ లో ఛారిటీ పేరుతో ఫండ్స్ వసూలు చేసి ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడుతున్నారన్న కారణంతో సయ్యద్ షాహిద్ కు ఎన్‌ఎస్‌ఐఎ నోటీసులిచ్చింది. అలాగే మరోవైపు ఎపిలోని నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాలో ఎస్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్ లో తనిఖీలు చేపట్టిన ఎన్‌ఐఎ బృందాలు కీలక డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News