హైదరాబాద్: దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో మేడ్చల్ జిల్లా మురహరిపెల్లిలో ఉంటున్న కొమ్మురాజుల కనకయ్య ఇంట్లో ఎన్‌ఐఎ అధికారులు తనిఖీలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో దొరికిన పేలుడు పదార్థాల కేసులో తనిఖీలు చేపట్టింది. జిల్లా మురహరిపల్లిలోని ఓ క్రషర్ పని చేస్తున్న వరంగల్ వాసి కొమ్మురాజుల కనకయ్య ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.దుమ్ముగూడెంలో పట్టుబడిన పేలుడు పదార్థాల కేసులో కనకయ్య అన్న కుమారుడు నాగరాజుకు పరిచయం ఉన్న వాళ్లు పటాన్ చెరువులో సెల్లార్ పనుల కోసం పేలుడు పదార్థాలను తీసుకెళ్లినట్లు గుర్తించారు.
వీరు దుమ్ము గూడెంలో పట్టుబడిన పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారన్న అని అడగ్గా కనకయ్య పేరు చెప్పడంతో ఆయన నివాసముంటున్న ఇంట్లో తనిఖీలు చేశారు. ఏమీ లభ్యం కాకపోవడంతో పూర్తి వివరాలు సేకరించి వదిలేశారు. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో మొత్తం 5 జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. మహబూబ్‌నగర్, వరంగల్, జనగామ, భద్రాద్రి, మేడ్చల్ జిల్లాల్లో సోదాలు చేసింది. ఇదిలావుండగా సోమవారం నాడు జరిపిన తనిఖీల్లో 400 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు , 500 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్ల తో పాటు 400 జిలెటిన్ స్టిక్స్ , 549 మీటర్ల ఫ్యూజ్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఐఇడి, గ్రనేడ్ లాంఛర్ల తయారీకి అవసరమైన సామాగ్రి గుర్తించామని పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. ఈ పేలుడు పదార్థాలను మావోయిస్టు నేత హిడ్మాకు ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నామని ఎన్‌ఐఎ వెల్లడించింది.
NIA searches in Medchal district