మహారాష్ట్ర ముఖ్యమంత్రి థాక్రే అనుమానం
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద గత నెలలో బాంబులతో వాహనం కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అలాగే ఈ వాహనం యజమాని మన్‌సుఖ్ హిరేన్ అనుమానాస్పద స్థితిలో ఈనెల 5 న మృతి చెంది ఉండడం కూడా అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఈ రెండు సంఘటనలకు సంబంధించి కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కు కేంద్ర హోంశాఖ బదిలీ చేయడం వెనుక ఏదో కుట్ర ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అనుమానం వ్యక్తం చేశారు. పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ వ్యవస్థలు అలాగే స్థిరంగా ఉంటాయని, వాటిపై నమ్మకం ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక స్కాడ్ (ఎటిఎస్)దర్యాప్తు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యత కేంద్రం తీసుకొంటున్నదంటే ఏదో ఉందని అనుమానం కలుగుతోందని, ఏదేమైనా రాష్ట్రంలో ఎటిఎస్ ఈ దర్యాప్తును కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎటిఎస్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని, మన్‌సుఖ్ మరణానికి కారణం ఏమిటో తేలేవరకు ఈ కేసు దర్యాప్తు వదిలిపెట్టబోమని తెలిపారు. ఎంపి మోహన్ డెల్కర్ ఆత్మహత్యపై కూడా తాము దర్యాప్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక్కడ ఎలాంటి వ్యవస్థా లేదని, ప్రతీదీ కేంద్రంపై ఆధారపడి ఉందని చెప్పడం ద్వారా మహారాష్ట్ర పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు.