Thursday, January 23, 2025

బాంబు సైక్లోన్ దెబ్బ.. మంచుగా వేలాడుతున్న నయాగరా

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ప్రఖ్యాత నయాగరా జలపాతం పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. అమెరికాలో ప్రస్తుత మంచుతుపాన్ తీవ్రస్థాయి దశలో జలపాతం మంచుగడ్డగా మారి వేలాడుతోంది. పశ్చిమ న్యూయార్క్ ప్రాంతం ఇప్పుడు ఎడతెరిపిలేని బాంబు సైక్లోన్‌తో అత్యంత శీతల భీకర వాతావరణం చవిచూస్తోంది. ప్రస్తుత పరిణామం ఈ శతాబ్ధపు మంచుదెబ్బ అని స్థానిక అధికారులు నిర్థారించారు. దేశంలోని పలు రాష్ట్రాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. బఫెలో తదితర ప్రాంతాలలో రోడ్లపై ఉన్న పలు కార్లు, వాహనాలలోని వారు మంచుశకలాలల నడుమ లోపల చనిపోయి ఉన్నట్లు క్రమేపీ తెలుస్తోంది. దీనితో దేశవ్యాప్తంగా ఈ మంచుతుపాన్ మృతులు సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా మంచు తాకిడి ఘటనలలో మృతుల సంఖ్య 55 దాటిందని ఓ విశ్లేషణలో వెల్లడైంది. కేవలం న్యూయార్క్,బఫెలో ప్రాంతాల్లోనే దాదాపు 30 మంది వరకూ దుర్మరణం చెందారు.

పలు చోట్ల మంచుశకలాల కింద మనుష్యులు చిక్కుపడి ఉన్నట్లు గుర్తించారు. నయాగరా మంచులో కూరుకుపోయి ఉన్న సంబంధిత ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెట్టారు. శీతాకాలపు గడ్డకట్టిన వింతగా నయాగరా జలపాతం ఇప్పుడు అక్కడికి వెళ్లుతున్న అతి కొద్ది మంది సందర్శకులకు కన్పిస్తోంది. మంచుగడ్డలు వేలాడుతున్న జలపాతంలో నీరు ధారలు కూడా ఉండటంతో ఇక్కడ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వింత దృశ్యాలు కన్పిస్తున్నాయి. శీతాకాలంలో తరచూ నయాగరా జలపాతం మంచు వంతెనగా కన్పిస్తూ ఉంటుంది. 1912 ఫిబ్రవరి 4వ తేదీన కొందరు సాహసికులు ఈ మంచువంతెనపై నుంచి నడుస్తూ ఉండగా ఇది ఉన్నట్లుండి కరిగిపోయింది. పై నున్న ముగ్గురు కింద ఉన్న నయాగరా నదిల పడి ప్రాణాలు కోల్పోయ్యారు. ఈ ఘటన తరువాత శీతాకాలంలో ఈ ప్రాంతంలో పలు నిషేధాజ్ఞలు విధించారు.

బఫెలోలో మంచు తాకిడికి ఎక్కువ మంది బలి

న్యూయార్క్ సమీపంలోని బఫెలో ప్రాంతంలో క్రిస్మస్ ముందు మొదలైన తీవ్రస్థాయి హిమపాతం ఇప్పటికీ ఆగని రీతిలో విలయం సృష్టిస్తోంది. ఇక్కడ 50 అంగుళాల కంటే ఎక్కువగా మంచుపడింది. చాలా చోట్ల ఇళ్లల్లో కార్లలో పేరుకుపోయిన మంచు దిబ్బల కింద పడి జనం చనిపోతున్నారు. 22 ఏళ్ల యువతి అండెల్ టేలర్ ఓ కారులో మంచులో చిక్కుపడింది. ఈ విధంగా దాదాపు 18 గంటల పాటు లోపలే ఉండాల్సి వచ్చింది. ఈ చలి తీవ్రతతో ఆమె చనిపోయింది. చనిపోవడానికి ముందు ఈ యువతి తన దీన స్థితిని తెలియచేసుకుంటూ ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. తన చావు భయం గురించి తెలియచేసుకుంటూ, తాను బందీ అయిన విషయాన్ని తనకు తప్పని చావును తెలియచేసుకుంటూ వెలువరించిన ఈ సజీవ కథనం అందర్ని ఆవేదనకు గురి చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News