Sunday, December 22, 2024

జోరు మీదున్న మార్కెట్.. ఆల్‌టైమ్ హై

- Advertisement -
- Advertisement -

20 వేల పాయిట్లను దాటిన నిఫ్టీ.. ఆల్‌టైమ్ హై
మళ్లీ 67,000 మార్క్‌కు సెన్సెక్స్
జి20 సదస్సు సక్సెస్‌తో ఇన్వెస్టర్లలో జోష్

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకున్నాయి. గత రెండు వారాలుగా ఇండెక్స్‌లు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. తాజాగా జి20 సదస్సు విజయవంతం కావడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ తొలిసారిగా 20,000 మార్క్‌ను దాటింది. ఆ తర్వాత కొద్ది పాయింట్లు వెనక్కి వచ్చింది. నిఫ్టీ 19,000 నుండి 20,000 స్థాయిని తాకడానికి మొత్తం 52 ట్రెండింగ్ సెషన్‌లు పట్టింది. బ్యాంకింగ్ షేర్లు, అదానీ గ్రూప్ స్టాక్స్ కొనుగోళ్ల కారణంగా నిఫ్టీ ఈ మైలురాయిని సాధించింది. అదే సమయంలో బిఎస్‌ఇ సెన్సెక్స్ మరోసారి 67,000 పాయింట్ల మార్క్ దాటింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 550 పాయింట్ల లాభంతో 67,156 వద్ద ముగిసింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి 20,000 స్థాయి వద్ద స్థిరపడింది.

తొలిసారి 20,000 దాటిన నిఫ్టీ
స్టాక్ మార్కెట్ లో దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు కారణంగా నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి 20,000 పాయింట్ల మార్క్‌ను దాటడంలో విజయం సాధించింది. ఓ దశలో నిఫ్టీ 20,008 పాయింట్లకు చేరుకుంది. అయితే ఈ సూచీ 19,000 నుండి 20,000 స్థాయిని తాకడానికి మొత్తం 52 ట్రెండింగ్ సెషన్‌లు తీసుకుంది. స్టాక్ మార్కెట్‌లో మీడియా మినహా అన్ని రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ స్టాక్స్‌లో గరిష్ట కొనుగోళ్లు కనిపించాయి. బ్యాంక్ నిఫ్టీ 414 పాయింట్ల జంప్‌తో 45,570 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటి, ఆటో, ఎనర్జీ, ఎఫ్‌ఎంసిజి, మెటల్స్, ఫార్మా, హెల్త్‌కేర్ వంటి రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి. మిడ్ క్యాప్ స్టాక్స్‌లో మంచి కొనుగోళ్లు కనిపించాయి. దీంతో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 466 పాయింట్లు పెరిగి 41,444 పాయింట్ల వద్ద ముగిసింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 170 పాయింట్ల జంప్‌తో 12,982 పాయింట్ల వద్ద ముగిసింది. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 45 షేర్లు లాభాలతో ముగియగా, 5 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 28 స్టాక్స్ లాభాలతో ముగియగా, కేవలం రెండు మాత్రమే నష్టాలతో ముగిశాయి.

రూ.3 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్ మార్కెట్ జోష్‌తో పెట్టుబడిదారుల సంపద గణనీయంగా పెరిగింది. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ గత ట్రెండింగ్ సెషన్‌లో రూ.320.92 లక్షల కోట్లుగా ఉండగా, సోమవారం ఇది రూ.324.25 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.3.33 లక్షల కోట్లు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News