దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్ బాత్ !!
ముంబై: స్టాక్ మార్కెట్‌పై బేర్స్ మళ్లీ పట్టుబిగించారు. నేడు వారం చివరిరోజున(శుక్రవారం) మదుపరుల రూ. 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది. వరుసగా 4వ రోజున కూడా నష్టాలు ముట్టగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ నష్టాల ప్రతికూల ప్రభావాలు, కొవిడ్ భయాలు, అమెరికాలో హాలిడే సీజన్ కారణంగా విదేశీ మదుపరులు కొనుగోళ్లు తగ్గించేశారు. సంవత్సరం చివరిలో ఎలాంటి దన్ను లేకుండా పోయింది. నిఫ్టీ ఈ ఏడాది ఈ రోజున అత్యంత హీనంగా ఉండింది(వర్ స్ట్ పర్ఫార్మర్). గత 14 ఏళ్లలో ఎన్నడూ ఇంతలా పడిపోలేదు. 2008 తర్వాత ఈ రోజే ఇంతలా పడిపోయింది. ఈయర్ టు డేట్(YTD)టాప్ లూజర్స్‌లో విప్రో, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టిసిఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్, దివీస్ లాబొరేటరీస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఉన్నాయి.
బిఎస్‌ఈ సెన్సెక్స్ తన సైకాలజీ మార్క్ 60000ను ఛేదించింది. ఇంట్రాడే ట్రేడ్‌లో దాదాపు 700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా తన కీలక 18000 మార్కు కంటే కిందకి వెళ్లిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 980.93 పాయింట్లు లేక 1.61 శాతం క్షీణించి 59845.29 వద్ద, నిఫ్టీ 320.55 పాయింట్లు లేక 1.77 శాతం క్షీణించి 17806.80 వద్ద ముగిశాయి. నిఫ్టీ50లో ప్రధానంగా అదానీ పోర్ట్ సెజ్, అదానీ ఎంటర్‌ప్రెన్యూర్, హిందాల్కో, టాటాస్టీల్ నష్టపోగా, శిల్పా మెడికేర్, లేటెంట్ వ్యూఅనాలిటిక్స్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, సూవెన్ ఫార్మా లాభపడ్డాయి. ఐఒబి షేరయితే 16 శాతం, అంబుజా సిమెంట్స్ 8 శాతం నష్టపోవడం గమనార్హం. శుక్రవారం ఒక్క రోజునే మదుపరులు రూ. 5.5 లక్షల కోట్లు కోల్పోయారు. బిఎస్‌ఈ మార్కెట్ మూలధనం రూ. 275.01 లక్షల కోట్లు కోల్పోయింది.