నియామే : పశ్చిమ నైగర్‌లో ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన దాడిలో కనీసం 12 మంది సైనికులు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇక్కడి మిలిటరీ జుంటా శుక్రవారం తెలిపింది. తిలబేరి ప్రాంతంలోని కందాద్జి పట్టణంలో సైనికులు శాంతిభద్రతల పరిరక్షణ విధులకు వెళ్లినప్పుడు వందలాది మంది జిహాదీలు బైక్‌లపై వచ్చి సైనికులను చుట్టుముట్టినట్లు , కాల్పులకు దిగినట్లు నైగర్ రక్షణ మంత్రి జనరల్ సలిఫో తెలిపారు. తరువాత సైనిక బృందాలు ఎదురుదాడికి దిగాయి. వందమంది తీవ్రవాదులను మట్టుపెట్టాయని జుంటా తెలిపింది.
వారి ఆయుధాలను, వాహనాలను ధ్వంసం చేసినట్లు వివరించారు. అయితే సైనిక వర్గాల వాదనను ఏ వార్తా సంస్థ ధృవీకరించలేదు. గత కొద్ది కాలంగా ఈ పశ్చిమాఫ్రికా దేశం అల్‌ఖైదా, ఐసిస్ జిహీదీ తీవ్రవాద చర్యలతో , ఎడతెరిపిలేని దాడులతో కల్లోలితం అయింది. జులైలో సైనికబృందాలు కొన్ని తిరుగుబాటుకు దిగి, దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షులు మెహమ్మద్ బజౌమ్‌ను పదవీచ్యుతులు చేశాయి. అప్పటి నుంచి దేశంలో ఇస్లామిక్ తీవ్రవాదులకు , సైన్యానికి పరస్పర దాడులతో పరిస్థితి దిగజారుతోంది.