రూ.77లక్షలు వసూలు చేసిన నిందితుడు
హైదరాబాద్: హెర్బల్ ఆయిల్ సరఫరా చేస్తానని ఆన్‌లైన్‌లో కాంటాక్ట్‌లోకి వచ్చి డబ్బులు తీసుకుని మోసం చేసిన నైజీరియాకు చెందిన నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి పాస్‌పోర్టు, ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లు, చెక్‌బుక్, రెండు డెబిట్ కార్డులు, 10 గ్రాముల బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నైజీరియాకు చెందిన ఓజోఈజీ చార్లెస్ ఒకేలు మహారాష్ట్రలోని ఎన్‌ఐఐటిలో చదువుకుంటున్నాడు. నగరానికి చెందిన బాధితుడు చెమ్‌ట్రాక్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్నాడు. కంపెనీ కెమికల్స్‌ను ఇంపోర్టు చేసుకునేందుకు సప్లయ్ చేసే వారి కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే జూలై 25వ తేదీన మెయిల్ వచ్చింది. యూకేకు చెందిన గ్రిడాన్ మేనేజర్ పేరుతో వచ్చింది.
తాము హెర్బల్ ఆయిల్ తయారు చేసేందుకు ఇండియా నుంచి జైడన్ లిక్విడ్ ఆయిల్ సరఫరా చేసేవారి కోసం చూస్తున్నామని చెప్పారు. జైడన్ ఆయిల్ ముంబాయిలోని తివారీ హెర్బల్ ట్రేడర్స్ వద్ద ఉందని చెప్పాడు. వెంటనే బాధితుడు ఆ కంపెనీని కాంటాక్ట్ చేశాడు. ఈ ఇక్కడ నైజీరియన్ ప్రధాన పాత్ర పోషించాడు. తాను ఆయిల్‌ను సరఫరా చేస్తానని చెప్పాడు. తనకు 50లీటర్ల జైడన్ లిక్విడ్ ఆయిల్ కావాలని ఆర్డర్ పెట్టాడు. దీనికి గాను బాధితుడు రూ.77లక్షలు వివిధ బ్యాంకుల ద్వారా పంపించాడు. వాటిని తీసుకున్న నిందితుడు అప్పటి నుంచి ఫోన్ కాల్స్‌కు స్పందించడం మానివేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ లక్ష్మికాంత్ రెడ్డి దర్యాప్తు చేశాడు.