పదవి చేపట్టనున్న మొదటి ఆఫ్రికన్ మహిళ
న్యూఢిల్లీ: నైజీరియా ఆర్థికవేత్త ఎన్‌గోజీ ఒకోంజోఐవీలా(66)ను ప్రపంచ వాణిజ్యసంస్థ(డబ్ల్యూటిఒ) డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ఈ నియామకంతో డబ్ల్యూటిఒకు మొదటి మహిళ, మొదటి ఆఫ్రికన్ చీఫ్‌గా గోజీ రికార్డు సాధించారు. నైజీరియా మాజీ ఆర్థికమంత్రియైన గోజీ డబ్ల్యూటిఒ డైరెక్టర్ జనరల్‌గా ఈ ఏడాది మార్చి 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె నియమకానికి తమ సభ్యులంతా అంగీకారం తెలిపారని డబ్ల్యూటిఒ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. మూడు నెలల క్రితం గోజీ నియామకం విషయంలో ట్రంప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా, ఇప్పుడామెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గమనార్హం. జోబైడెన్ ప్రభుత్వం ఆమె ఎంపిక పట్ల సానుకూలత వ్యక్తం చేయడంతో లైన్ క్లియరైంది. ఇటీవల చైనా,అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య వైషమ్యాలు, ప్రపంచ వాణిజ్య సంస్థ తరఫున ఆమె ఎదుర్కోనున్న ప్రధాన సమస్యగా ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. హర్వార్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రాన్ని అధ్యయనం చేసిన గోజీకి ప్రపంచ బ్యాంక్‌లో పని చేసిన అనుభవం కూడా ఉన్నది. ఆ పదవికి గోజీ తగిన ఎంపిక అని, అందుకు కావాల్సిన అర్హతలన్నీ ఆమెకు ఉన్నాయని డబ్ల్యూటిఒ మాజీ చీఫ్ పాస్కల్ లేమీ స్పష్టం చేశారు.