న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఒక 30 ఏళ్ల నైజీరియన్ మహిళకు మంకీపాక్స్ వైరస్ సోకినట్లు నిర్ధారణైంది. దీంతో ఢిల్లీలో ఇది ఎనిమిదవ మంకీపాక్స్ కేసు కాగా దేశంలో 13వ కేసని శుక్రవారం వర్గాలు తెలిపాయి. మంకీపాక్స్ సోకిన నైజీరియన్ మహిళను ఇక్కడి ఎన్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేర్చినట్లు వర్గాలు వెల్లడించాయి. మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మరో వ్యక్తిని కూడా ఢిల్లీ ప్రభుత్వ యాజమాన్యంలోని ఆసుపత్రిలో చేర్చినట్లు వర్గాలు చెప్పాయి. అనుమానిత వ్యక్తి కూడా నైజీరియన్ మహిళేనని, ఆమెను కూడా ఈ నెల 14న ఆసుపత్రిలో చేర్చారని వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు ఢిల్లీలో నమోదైన ఎనిమిది కేసులలో ముగ్గురు పురుషలని వారు చెప్పారు. ఇది వరకు ఆసుపత్రిలో చేర్చించిన మిగిలిన ఆరుగురు రోగులకు చికిత్స అందచేసి డిశ్చార్జ్ చేయడం జరిగిందని ఒక సీనియర్ డాక్టర్ చెప్పారు. మంకీపాక్స్ అనేది జంతువుల నుంచి సంక్రమించే వైరస్ వ్యాధి. ఇది సోకిన వారికి జ్వరం, చర్మంపై దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట, నీరసం, చలి, అధిక చెమట్లు, గొంతు నొప్పి, దగ్గు వంటివి సహజంగా కనిపించే లక్షణాలు.
Nigerian woman test positive for monkeypox in Delhi