ఎపిలో 1,831 కరోనా కేసులు
ఈనెల 18 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 36,452 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,831 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 467 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190, గుంటూరు జిల్లాలో 164, అనంతపురం జిల్లాలో 161 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 40 కేసులను గుర్తించారు.అదే సమయంలో 242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,84,674 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,62,974 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 7,195 మందికి చికిత్స జరుగుతోంది. ఇప్పటివరకు 14,505 మంది కరోనాతో మరణించారు.
ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణ చేసింది. పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు