తెరుచుకోనున్న విద్యాసంస్థలు
బెంగళూరు: కర్నాటకలో సోమవారం(31వ తేదీ) నుంచి రాత్రి పూట కర్ఫ్యూ ఆంక్షలను ఉపసంహరించనున్నారు. అదే విధంగా బెంగళూరులో పాఠశాలలు, కళాశాలలో సోమవారం నుంచి తెరుచుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కొవిడ్ కారణంగా ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య 2 శాతం మాత్రమే ఉండడంతోపాటు రికవరీ రేటు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలల్లో అన్ని తరగతులు ప్రారంభమవుతాయని, కొవిడ్ నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బిసి నగేశ్ తెలిపారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై సమీక్షా సమావేశం అనంతరం నగేశ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం 50 శాతం సీటింగ్ సామర్ధంతో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, పబ్‌లు, బార్లు, ఫంక్షన్ హాళ్లు సవరించిన మార్గదర్శకాల మేరకు పూర్తి సామర్ధంతో ఇక పనిచేస్తాయని ఆయన చెప్పారు. అయితే సినిమా థియేటర్లు, ఆడిటోరియాలు, మల్టీప్లెక్సులలో మాత్రం 50 శాతం సీటింగ్ సామర్ధం కొనసాగుతుంది.