Wednesday, January 22, 2025

చావు బతుకుల అంచుల్లో లక్షలాది పాలస్తీనియన్లు

- Advertisement -
- Advertisement -

ఖాన్ యూనిస్ : గాజాలో పలు చోట్ల ఇజ్రాయెల్ సేనలు తమ భూతల దాడిని మరింత తీవ్రతరం , విస్తారితం చేస్తున్నాయి. మరో వైపు వైమానిక దాడులు కూడా సాగుతున్నాయి. బాధితులు, క్షతగాత్రులతో కిక్కిరిసి ఉన్న ఆసుపత్రులపై కూడా వైమానిక దాడులు జరుగుతాయనే భయాందోళనలు నెలకొన్నాయి. తమ లక్షం హమాస్‌ను నిర్మూలించడం అని ఇజ్రాయెల్ పరమవీర పంతం పద్ధతిలో అనేక రకాలుగా దాడులకు దిగింది. గ్రౌండ్ అటాక్‌లతో హమాస్ కంచుకోటలైన టన్నెల్స్‌ను నేలమట్టం చేస్తోంది. ఆసుపత్రులలో జనం రక్షణ కవచంగా చేసుకుని హమాస్ మిలిటెంట్లు కార్యకలాపాలు సాగిస్తున్నారనే అనుమానాలు తలెత్తడంతో ఇక ఆసుపత్రుల వద్ద కూడా బాంబులు కురిపించేందుకు రంగం సిద్ధం అయిందని వెల్లడైంది. దీనితో ఆసుపత్రుల్లోని వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకునిగడుపుతున్నారు.

శకటాలతో గాజా వీధులలో ఇజ్రాయెల్ సేనలు
ఇజ్రాయెల్ కాల్బలం సోమవారం ఉత్తర, మధ్య గాజాలోని మారుమూల ప్రాంతాలకు చొచ్చుకువెళ్లుతోంది. సాయుధ బలగాలు అత్యంత అధునాతన సామాగ్రితో కూడిన శకటాలతో గాజాలో స్వైరవిహారం చేస్తున్నాయి. ఆసుపత్రులకు సమీపంలో కూడా వైమానిక దాడులు జరుగుతాయని ఐరాస సంస్థలు, వైద్య సిబ్బంది హెచ్చరికలు వెలువరించింది. వేలాది మంది గాయపడ్డ వారు, వేలాదిగా నిరాశ్రయ పాలస్తీనియన్లు తలదాచుకున్న ఆసుపత్రులు ఇప్పుడు ఏ క్షణంలో అయినా భీకరదాడుల టార్గెట్లు కానున్నాయనే ఆందోళన నెలకొంది. ఇజ్రాయెల్ ట్యాంక్‌లు గాజాలో పలుచోట్ల వీధులలో కలియతిరుగుతున్నట్లు తెలిపే వీడియోలను అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ వెలువరించింది. సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ ట్యాంకులు దుమ్మురేపుతున్నాయి.

ఈ ప్రాంతపు నార్త్ సౌత్ హైను దిగ్బంధించి ఇవి ముందుకు సాగుతున్నాయి. భూతల దాడుల నుంచి తప్పించుకునేందుకు హమాస్ మిలిటెంట్లు ఈ మార్గం వాడుకుంటున్నారనే సమాచారంతో ఇప్పుడు ఇజ్రాయెలీ సేనలు దీనిని తమ అదుపులోకి తెచ్చుకున్నాయి. సంబంధిత పరిణామంపై ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి నేరుగా సమాధానం ఇవ్వలేదు. తమ దాడులు మరింత విస్తారితం అవుతున్నాయని స్పష్టం చేశారు. ఈ దారిలో వచ్చిపోయే పలు వాహనాలను ట్యాంకులు అడ్డుకుంటున్నాయి. వెనకకు పంపిస్తున్నాయి. మాటవినక ముందుకు వెళ్లే వాటిపై కాల్పులు జరుగుతున్నాయి. ఒకటి రెండు చోట్ల కార్లలో ఇతర వాహనాలలో మంటలు చెలరేగడం, తరువాత అవి పేలిపోవడం వంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఇది రెండో దశ యుద్ధం ః నెతన్యాహూ
అన్ని విధాలుగా పరిస్థితిని విశ్లేషించుకుని ఇజ్రాయెల్ సేనలు భూతల దాడులకు దిగాయి. గాజాసిటీకి, ఉత్తర గాజాకు సమీపంలో ఇజ్రాయెల్ సేనలు మొహరించుకుని ఉన్నాయి. లోపలి హమాస్ మిలిటెంట్లు ఎటూ తప్పించుకోకుండా కట్డడి చేస్తూ, ముందుకు కదులుతూ ఎక్కడికక్కడ తన ప్రాబల్యం చాటుకుంటున్నాయి. ఇప్పుడు తమ యుద్ధం రెండో దశకు చేరుకుందని, ఇది కీలకమైనదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. హమాస్ శక్తులు క్రూరంగా అక్టోబర్ 7వ తేదీన సాగించిన దాడులకు తాము తగు విధంగా జవాబు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

పలు జాతీయ రహదారులు దిగ్బంధంలో ఉండటంతో ఇప్పుడు లక్షలాదిగా పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోనే ఉండాల్సి వస్తోంది. ఉన్నచోటనే ఉంటూ ఎప్పుడు బాంబుదాడులకు , పేలుళ్లకు గురికావల్సివస్తుందో తెలియని స్థితిలో జనం కొట్టుమిట్టాడుతున్నారు. శిధిల గాజా నగరంలోని అల్ ఖ్వాద్ హాస్పిటల్, ఉత్తర గాజాలోని ఇండోనేసియన్ వారి ఆసుపత్రి వద్దనే ఇటీవల వైమానిక దాడులు జరిగాయి. షిఫా హాస్పిటల్‌లో లక్షలాదిగా పౌరులు తలదాచుకుంటున్నారు. పలు చోట్ల ఆసుపత్రులకు అతి సమీపంలోనే దాడులు జరుగుతూ వస్తున్నాయని, ఇది పరిస్థితిని మరింత దారుణం చేస్తోందని వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసింది.

ఆసుపత్రులే నివాసాలుగా 1,17,000 పాలస్తీనియన్లు
ఇజ్రాయెల్ భూతల దాడుల నేపథ్యంలో ఇప్పుడు పాలస్తీనియన్లు నిర్వాసితులు అయ్యారు. ఇప్పటికే దాదాపు 1,17,000 మంది పౌరులు విధిలేని స్థితిలో ఆసుపత్రులలో రోగుల నడుమ ఉండాల్సివస్తోంది. ఉత్తర గాజా ప్రాంతంలోని ఆసుపత్రులలో జనం జాతర పరిస్థితి నెలకొంది. ఆసుపత్రులైతే తమకు భద్రత ఉంటుందని, కనీసం వీటిపై అయినా దాడికి పాల్పడకుండా ఉంటారని ఇక్కడికి చేరిన వారు ఆశిస్తున్నారు. అయితే హమాస్ నిర్మూలనే లక్షంగా సాగుతోన్న ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు తమ దాడుల క్రమంలో అన్నింటిని తమ టార్గెట్లుగానే ఎంచుకుంటూ సాగుతోంది. దీనితో ఆసుపత్రులు కూడా దాడుల భయాలతో దడదడలాడాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు.

ఇప్పటికీ 8000 మంది పాలస్తీనియన్ల బలి
ఇజ్రాయెల్ దాడుల క్రమంలో ఇప్పటివరకూ మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య ఎనిమిదివేలు దాటింది. మృతులలో అత్యధికులు మహిళలు , పసివారే ఉన్నారని పాలస్తీనియా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా హమాస్ దాడుల్లో ఇప్పటివరకూ 1400 మంది ఇజ్రాయెలీలు మృతి చెందారు. ఈ విధంగా అతి తక్కువ కాలంలో అత్యధిక రక్తపాతం నెలకొన్న ఘర్షణగా ఇప్పటి యుద్ధం మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News