Thursday, November 14, 2024

జపాన్ సంస్థకు నోబెల్ శాంతి

- Advertisement -
- Advertisement -

జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యోను నోబెల్ శాంతి పురస్కారం వరించింది. 2024 సంవత్సరానికి గాను ఆ సంస్థకు నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలోని ఐదుగురు సభ్యుల నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. అణ్యాయుధాలు లేని ప్రపంచాన్ని సృష్టించేందుకు ఆ సంస్థ చేస్తున్న ప్రయత్నానికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ బృందం ఇతర నోబెల్ బహుమతులను ప్రకటిస్తుండగా, వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఆదేశం ప్రకారం శాంతి బహుమతిపై ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుంటుంది. హిరోషిమా, నాగసాకి అణుబాంబు ఘటనలో ప్రాణాలతో బయటపడినవారి నుంచి ఈ అణుబాంబు రహిత ఉద్యమం ప్రారంభమైంది. అణుబాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి ఆ సంస్థ సేవలు అందిస్తోంది. ‘అణ్వస్త్ర వినియోగంపై నిషేధం ఒత్తిడికి లోనవుతున్నందున’ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్జెన్ వత్నె ఫ్రైడ్నెస్ తెలిపారు.

‘శారీరక ఇబ్బందులు, బాధాకర జ్ఞాపకాలు ఉన్నప్పటికీ శాంతిపై ఆశలు రేకెత్తించడానికి, అందుకు కృషి చేయడానికి తమ అనుభవాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్న ఆ బాధితులందరినీ సత్కరించాలని నోబెల్ కమిటీ ఆకాంక్షిస్తోంది’ అని ఆయన తెలియజేశారు. ఈ పురస్కారం ప్రకటన కోసం హిరోషిమా సిటీ హాల్ వద్ద నిల్చున్న హిడాంక్యో చైర్‌పర్సన్ తొమోయికి మిమాకి ఈ వార్త అందగానే ఆనందబాష్పాలు రాల్చారు. ‘ఇది నిజంగా నిజమేనా? అనూహ్యం’ అని మిమాకి కేకలు వేశారు. అణ్వాయుధాల నిర్మూలన యత్నాలకు నోబెల్ కమిటీ గతంలో కూడా పురస్కారాలు ప్రకటించింది. అంతర్జాతీయ అణ్వాయుధాల రద్దు ప్రచారోద్యమ సంస్థ 2017లోను. సైన్స్, ప్రపంచ వ్యవహారాలపై పగ్వాష్ కాన్ఫరెన్సెస్. జోసెఫ్ రోట్‌బ్లాట్ 1999లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నాయి. ప్రపంచంలో, ముఖ్యంగా మధ్య ప్రాచ్యం. ఉక్రెయిన్, సూడాన్‌లలో ప్రజ్వరిల్లుతున్న దారుణ సంఘర్షణల నేపథ్యంలో ఈ సంవత్సరం బహుమతి ప్రకటన వెలువడింది. ‘అణ్వాయుధాల వాడకం బెదరింపులు ముఖ్యమైన అంతర్జాతీయ సూత్రం అణ్వాయుధాల వినియోగ నిషేధంపై ఒత్తిడి పెంచుతున్నాయనేది సుస్పష్టం’ అని వత్నె ఫ్రైడ్నెస్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News