న్యూఢిల్లీ : ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్య భారత్‌కెనడా మధ్య వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని ఆరోపించాక, రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో హర్‌దీప్ సింగ్ హత్యకు సంబంధించిన వీడియో వెలుగు లోకి వచ్చింది. ఈ ఏడాది జూన్ 18న రాత్రి 8.27 గంటల సమయంలో జరిగింది. కెనడాలో బ్రిటిష్ ప్రావిన్స్ లోని సర్రే గురుద్వారా ఎదురుగా నిజ్జార్ హత్య జరిగినట్టు వీడియోలో వెల్లడైంది.
ఈ వీడియోకు సంబంధించి ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ప్రత్యక్షసాక్షి కథనాన్ని ప్రచురించింది. 90 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ముఖానికి మాస్కులు ధరించిన ఆరుగురు దుండగులు రెండు వాహనాలపై వచ్చి నిజ్జార్ పై కాల్పులు జరిపారని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ హత్య జరిగిన సమీపం లోనే సిసిటివి కెమెరా ఉందని, అందులో నిజ్జార్ హత్య దృశ్యాలు రికార్డు అయ్యాయని తెలిపింది. నిజ్జార్‌ను నేరస్థులు వెంబడించిడం, ఒక చోట అడ్డుకుని అతనిపై కాల్పులు జరపడం , అనంతరం అక్కడి నుంచి దుండగులు తాపీగా వెళ్లి పోవడం వంటి దృశ్యాలు రికార్డయ్యాయని వెల్లడించింది. సర్నే లోని గురుద్వారా పార్కింగ్ స్థలంలో నిజ్జార్ వినియోగించే గ్రేకలర్ పికప్ ట్రక్ , ఓ తెల్లటి సెడాన్ కారు పక్కపక్కనే సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి.
ఇంతలోనే సెడాన్ కారు వేగంగా ముందుకెళ్లి నిజ్జార్ ట్రక్ ఎదురుగా వచ్చి ఆగింది. అప్పుడు ముఖం కనిపింకుండా హుడెడ్ స్వెట్ షర్టులు ధరించిన ఇద్దరు ఆయుధాలతో నిజ్జార్ ట్రక్ వద్దకు వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజిలో ట్రక్ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. దుండగులు మొత్తం 50 రౌండ్లు కాల్పులు జరపగా, అందులో 34 నిజ్జార్ శరీరంలో దూసుకెళ్లాయని తెలిపింది. కాల్పులు జరిపిన తరువాత ఆ ఇద్దరు సెడాన్ కారు వైపు పరుగులు తీశారు. నిజ్జార్ హత్యను ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపిన వివరాలతోపాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం అక్కడి పోలీస్‌లు చేస్తున్నారు.
భూపేందర్ సింగ్ అనే వాలంటీర్ ఆ సమయంలో అక్కడ తాను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నానని, కాల్పుల శబ్దం విని ఏవో టపాసులు అనుకున్నానని తెలియజేశాడు. వెంటనే పార్కింగ్ వద్దకు వెళ్లి చూస్తే నిజ్జార్ ట్రక్ అద్దాలు మొత్తం రక్తంతో నిండి ఉన్నాయని తెలిపాడు. తనతోపాటు మరికొందరు స్నేహితులు కారు డోర్ తెరిచి చూస్తే అప్పటికే నిజ్జార్ చనిపోయాడని తెలిపాడు.