శరత్ కమల్‌కు ఖేల్ రత్న ప్రదానం
క్రీడా పురస్కారాలు బహూకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : తెలుగుతేజాలు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజలు ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డులను అందుకున్నారు. ఇక దేశంలోనే అత్యుత్తమ క్రీడా అవార్డుగా భావించే ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు ఈసారి ప్రముఖ టెబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్‌ను వరించింది. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. భారత బాక్సింగ్ స్టార్, తెలంగాణ ఆణిముత్యం నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును అందుకున్నారు. టిటి క్రీడాకారిణి ఆకుల శ్రీజకు కూడా అర్జున అవార్డు లభించింది. వీరిద్దరూ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను స్వీకరించారు. ఇక శరత్‌కమల్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు.
ఈసారి వివిధ క్రీడాంశాలకు చెందిన 25 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను అందించారు. అథ్లెటిక్స్‌లో సీమా పూనియా, ఆల్డస్ పాల్, అవినాష్, బ్యాడ్మింటన్‌లో ప్రణయ్, లక్షసేన్, బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, అమిత్, చెస్‌లో ప్రజ్ఞానంద, హాకీలో దీస్ గ్రేస్ ఎక్కా, రెజ్లింగ్‌లో సరితా దేవి, అన్షు, టిటిలో ఆకుల శ్రీజ, వెయిట్ లిఫ్టింగ్‌లో వికాస్ ఠాకూర్, షూటింగ్‌లో ఎలవెనిల్ వలవెనిల్, ఓంప్రకాష్ తదితరులు అర్జున అవార్డులను అందుకున్నారు. ఇక జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ ఖమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా షూటింగ్), సుజిత మాన్ (రెజ్లింగ్)లకు ద్రోణాచార్య అవార్డులు లభించాయి. మరోవైపు క్రీడా పురస్కార ప్రదానం కార్యక్రమంలో శాట్స్ చైర్మ న్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్, శ్రీజలను ఆయన అభినందించారు.