ప్రతిష్ఠాత్మకమైన ఎలొర్డా కప్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించింది. కజకిస్థాన్ వేదికగా ఈ పోటీలు జరుగుతున్నాయి. మహిళల 52 కిలోల విభాగంలో తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో నిఖత్ 50 తేడాతో కజకిస్థాన్‌కు చెందిన జజీరా ఉరక్‌బయొవాను ఓడించింది. ఆరంభం నుంచే నిఖత్ ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ అలవోక విజయంతో పసిడి పతకాన్ని దక్కించుకుంది.
మహిళల 48 కిలోల కేటగిరీలో భారత్‌కే చెందిన మీనాక్షి పసిడి సాధించింది. ఫైనల్లో మీనాక్షి 41 తేడాతో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన రామొనొవా సైదాహన్‌ను ఓడించింది. ప్రత్యర్థి నుంచి మీనాక్షికి కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన మీనాక్షి స్వర్ణం గెలుచుకుంది. కజకిస్థాన్‌లోని అస్తానా నగరంలో జరిగిన పోటీల్లో భారత బాక్సర్లు రికార్డు స్థాయిలో 12 పతకాలు గెలుచుకున్నారు.