బెంగళూరు: కిక్ బాక్సింగ్ పోటీలో గట్టిగా పంచ్ తగలడంతో కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో కిక్ బాక్సర్ దుర్మరణం చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జ్ఞాన భారతి ప్రాంతంలో ఓ జిమ్‌లో కర్నాటక కిక్ బాక్సింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 9న నిఖిల్ తన కోచ్ కిరణ్‌తో కలిసి కిక్ బాక్సింగ్ పోటీలకు వచ్చాడు. 10న పోటీల్లో పాల్గొన్నాడు. ప్రత్యర్థి గట్టి పంచ్ తల భాగంలో ఇవ్వడంతో నిఖిల్ కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోవడంతో నిఖిల్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోటీలు నిర్వహిస్తున్న స్థలంలో నిర్వాహకులు వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతోనే తన కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంటే తన కుమారుడు బతికేవాడని వాపోయారు. నిర్వాహకుల నిర్లక్యం తన కుమారుడి ప్రాణం తీసిందని తండ్రి సురేష్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో నిఖిల్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.