రిపబ్లికన్ అభ్యర్థిత్వం నుంచి వివేక్ రామస్వామి ఉపసంహరణ
ట్రంప్, డిశాంటిస్ తరువాత స్థానంలో హేలీ
వాషింగ్టన్ : దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ రిపబ్లికన్ అభ్యర్థిత్వ ఎన్నికల్లో ప్రముఖ పార్టీ అభ్యర్థి డొనాల్ ట్రంప్‌కు చివరి పోటీదారుగా ఉన్నారని ఆమె ప్రచార కమిటీ మంగళవారం వెల్లడించింది. ఆమె దక్షిణ కరోలినాలో రెండు పర్యాయాలు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె ప్రచార కమిటీ న్యూ హాంప్‌షైర్‌లో మరొక ప్రకటన విడుదల చేసింది. తదుపరి ప్రైమరీ న్యూ హాంప్‌షైర్‌లో వచ్చే వారం జరగనున్నది. ఐయోవా, న్యూహాంప్‌షైర్ ఎన్నికల ఫలితాల ప్రకారం 77 ఏళ్ల ట్రంప్ సాధారణ జనాభిప్రాయాని కన్నా మరింత బలహీనంగా ఉన్నారు.
ట్రంప్‌పై చాలా కాలంగా వోటర్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని 51 ఏళ్ల హేలీ ప్రచార మేనేజర్ బెట్సీ ఆంక్నీ ఒక‘స్టేట్ ఆఫ్ ది రేస్ మెమో’లో పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా పూర్వపు రాయబారి హేలీ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఐయోవా కాకస్‌లో మూడవ స్థానంతో బలంగా నిలిచారు. సాంప్రదాయకంగా ప్రైమరీ రేసును ఐయోవా కాకస్ ప్రారంభిస్తుంటుంది. ఆ తరువాత రానున్న కొన్ని నెలల్లో తక్కిన రాష్ట్రాలకు రేసు సాగుతుంది. తుదకు జూలైలో విస్కాన్సిన్‌లో జరగనున్న రిపబ్లికన్ జాతీయ సదస్సులో ఆ ప్రైమరీల విజేతను పార్టీ డెలిగేట్లు నామినేట్ చేస్తారు. హేలీ మాజీ బాస్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఐయోవా కాకస్‌లో 51 శాతం వోట్లతో గెలుపొందారు.
ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ 21.2 శాతం వోట్లతో రెండవ స్థానంలోను, హేలీ 19.1 శాతం వోట్లతో మూడవ స్థానంలోను నిలిచారు. భారతీయ అమెరికన్ వాణిజ్యవేత్త వివేక్ రామస్వామికి కేవలం 7.7 శాతం వోట్లు పోలయ్యాయి. దీనితో ఆయన రిపబ్లికన్ బరిలో నుంచి వైదొలిగారు. కాగా, ట్రంప్, డిశాంటిస్ తరువాత మూడవ స్థానంలో నిలిచినా హేలీ తన విజయానికి మార్గం సుగమం అవుతోందని నమ్ముతున్నారు. రిపబ్లికన్ ప్రైమరీ వచ్చేవారం న్యూహాంప్‌షైర్‌లోను, వచ్చే నెల తన స్వరాష్ట్రం దక్షిణ కరోలినాకు చేరుతుంది.
అవి ట్రంప్‌కు అంత తేలికైన ప్రాంతాలు కావని ఆంక్నీ పేర్కొన్నారు. ‘అమెరికాలో అత్యంత అయిష్టమైన రాజకీయ నేతలు ట్రంప్, బైడెన్. రిపబ్లికన్ ప్రైమరీ వోటర్లలో సుమారు సగం మంది ట్రంప్‌ను ఎక్కువగా కోరుకుంటున్నారు. సుమారు మరొక సగం ప్రత్యామ్నాయాన్ని ఇష్టపడుతున్నారు. తీవ్ర స్థాయిలో జరుగుతున్న పోటీకి అది నిదర్శనం’ అని ఆంక్నీ ఒక ప్రచార మెమోలో వివరించారు. న్యూ హాంప్‌షైర్‌లో హేలీ బలం ఎక్కువగా ఉన్నది. డిశాంటిస్ కన్నా ఆమె బాగా ఆధిక్యంలో ఉన్నారు.