మన తెలంగాణ/ హైదరాబాద్ : నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ భూమి పూజ చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి తొలిసారి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నూతన భవనంలో ఓపి, ఐపి, ఎమర్జెన్సీ సేవల కు ప్రత్యేకంగా బ్లాకులు ఉంటాయన్నారు. భవనం మొ త్తం ఎనిమిది అంతస్తులుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం నిమ్స్‌లో 1500 పడకలు ఉన్నాయని, నూతన భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసిహెచ్ కూడా పూర్తయితే మరో 200 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తద్వా రా ఒక నిమ్స్‌లోనే 3,700 పడకలు ఉంటాయని . నిమ్స్ ఎంసిహెచ్ పనులు వేగవంతం చేయాలన్నారు. పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నలువైపులా ఒక్కొక్కటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆసుపత్రులతోపాటు నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు హరీశ్‌రావు గుర్తు చేశారు.
స్టాఫ్ నర్స్ పరీక్ష ఆన్‌లైన్ ద్వారా..
వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో భర్తీ చేసే 5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్‌లైన్ విధానం (సిబిటి)లో నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నియామక ప్రక్రి య పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు 40,936 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్ష కోసం హైదరాబాద్ తో పాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల తుది ఫలితాలు విడుదల కంటే ముందే,అసిస్టెంట్ ప్రొఫెసర్ల ట్రాన్ఫర్ల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసిహెచ్
గాంధీ దవాఖానలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసిహెచ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసిహెచ్‌గా రికార్డు సృష్టిస్తామని చెప్పారు. గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాన్ని, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ పనులను వేగవంతం చేయాలన్నారు. నిమ్స్‌లో మాదిరిగా గాంధీలోనూ అవయవ మార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను మం త్రి ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ ప్రసాదించాలన్నారు. ఎంఎన్‌జె దవాఖానలో నూతనంగా ప్రారంభించిన ఆంకాలజీ బ్లాక్‌లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందాలన్నారు. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉండాలన్నారు.
ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్లు
ప్రజల అవసరాల మేరకు కేంద్రం వ్యాక్సిన్లు సరఫరా చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖాన, సిహెచ్ సిల్లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొవిడ్ సహా అన్ని రకాల వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో తెలంగాణ నెంబర్ 1 ఉండే లా కృషి చేయాలని సంబంధిత విభాగానికి ఆదేశించారు.
సిబ్బందికి ఆదర్శంగా ఉండాలి..
అందరికంటే ముందు, అందరి కంటే తర్వాత దవాఖానకు వచ్చి వెళ్లే డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు ఆదర్శప్రా యులని మంత్రి అన్నారు. ప్రతి రోజు రెండు గంటల పాటు ఆసుపత్రుల్లో రౌండ్స్ వేస్తూ, అన్ని విభాగాలు సం దర్శిస్తే మెజార్టీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికీ దొరకదని, బాధ్యతగా పని చేసి ప్రజల మన్ననలు పొంది, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలిపేందుకు సిఎం కెసిఆర్ 12వేలకోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సహా వైద్య సిబ్బంది ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కృషి చేయాలన్నారు. సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్యశ్రీ సిఈ వో విశాలాచ్ఛి, డిఎంఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావు, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, టివివిపి కమిషనర్ అజయ్‌కుమార్, సిఎం ఓఎస్డీ గంగాధర్, ని మ్స్ ఇంచార్జీ డైరెక్టర్ బీరప్ప, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, ఎంఎన్‌జె కేన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ జయలత, పాల్గొన్నారు.