Monday, December 23, 2024

టిఎస్‌పిఎస్‌సి లీకేజీ: ఆమెదే కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఆమె అడ్డదారిని ఎంచుకున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడ్డారు. చివరి బండారం బయటపడిపోవడంతో కటకటాల పాలయ్యారు. టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఉపాధ్యాయురాలు రేణుక కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి చెందిన పులిదిండి ప్రవీణ్‌కుమార్ బీటెక్ పూర్తి చేశాడు. ప్రవీణ్ తండ్రి హరిచంద్రరావు ప్రభుత్వ ముద్రణాలయంలో అదనపు ఎస్పీగా పనిచేసేవారు. విధి నిర్వహణలో మరణించటంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్ అక్కడే జూనియర్ అసిస్టెంట్‌గా చేరాడు. ముద్రణాలయం మూసేయడంతో 2017 నుంచి టిఎస్‌పిఎస్‌సిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్‌వో గా పనిచేస్తున్నాడు.

మహబూబ్‌నగర్ జిల్లా పగిడ్యాల్ పంచగల్ తండాకు చెందిన ఎల్. రేణుక గురుకుల ఉపాధ్యాయ పరీక్షకు దరఖాస్తు చేశారు. దరఖాస్తులో తప్పులు దొర్లటంతో సరిచేసుకునేందుకు టిఎస్‌పిఎస్‌సి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ప్రవీణ్‌తో పరిచయమైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రవీణ్ ఫోన్ నంబర్ తీసుకొని రేణుక తరచూ మాట్లాడుతుండేది. ప్రస్తుతం రేణుక వనపర్తి గురుకుల పాఠశాలలో పనిచేస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సోదరుడు రాజేశ్వర్ నాయక్ కోసం ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసేందుకు ఆమె సిద్ధమైంది. వికారాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రేణుక భర్త ఢాక్యానాయక్ ప్రవీణ్‌తో సంప్రదింపులు జరిపారు. అదే కార్యాలయంలో నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న ఎ.రాజశేఖర్‌రెడ్డితో కలసి ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ కార్యదర్శి డైరీలోని ఐపీ అడ్రస్‌ను దొంగచాటుగా సేకరించాడు. నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డితో కలసి కార్యాలయ ఇన్‌ఛార్జి కంప్యూటర్ నుంచి వివిధ విభాగాల ప్రశ్నపత్రాలున్న ఫోల్డర్‌ను ప్రవీణ్ 4 పెన్‌డ్రైవ్‌లలో భద్రపరిచాడు. కార్యాలయంలోనే ప్రశ్నాపత్రాలను పదుల సంఖ్యలో ప్రింట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రాలను అక్కడే ప్రింట్ తీసి వాటిని ఈ నెల 2న రేణుక, ఢాక్యానాయక్‌లకు ఇచ్చి రూ.5 లక్షలు తీసుకున్నాడు. రేణుక, ఢాక్యానాయక్, రాజేశ్వర్ నాయక్‌లను ప్రవీణ్ తన ఇంటికి కూడా తీసుకెళ్లాడు. ముగ్గురు అక్కడే రెండ్రోజుల పాటు ఉన్నారు.

ఈ నెల 5న రాజేశ్వర్‌ను పరీక్షా కేంద్రానికి తన వాహనంపైనే ప్రవీణ్ తీసుకెళ్లాడు. ఉదయం, సాయంత్రం రెండు పేపర్లు రాయించి తీసుకొచ్చాడు. పరీక్ష పూర్తయ్యాక ఈ నెల 6న రేణుక దంపతులు ప్రవీణ్‌కు మరో రూ.5 లక్షలు నగదు ఇచ్చారు. బేస్ పేపర్లు కావటంతో ప్రశ్నలు, సమాధానాలు పక్కనే ఉంటాయని గుర్తించారు. దీన్ని సొమ్ము చేసుకునేందుకు మరికొందరికి విక్రయించినట్లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News