నలుగురిపై మూడేళ్ల సస్పెన్షన్ వేటు: డిజిసిఎ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 1నుంచి ఏప్రిల్ 30 వరకు 9మంది పైలట్లు, 32 మంది క్యాబిన్ సిబ్బంది విమానం ఎక్కబోయే ముందు నిర్వహించే ఆల్కహాల్ పరీక్షల్లో విఫలమయినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డిజిసిఎ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.‘ వీరిలో ఇద్దరు పైలట్లు, మరో ఇద్దరు విమాన సిబ్బంది రెండో సారి పాజిటివ్‌గా దొరికినందున వీరిని మూడేళ్లపాటు సస్పెండ్ చేసినట్లు డిజిసిఎ ఒక ప్రకటనలో తెలిపింది. మిగతా ఏడుగురు పైలట్లు, 30 మంది క్యాబిన్ క్రూ సభ్యులు తొలిసారి బ్రీత్ అనలైజర్ టెస్టులో విఫలమయినందున మూడు నెలల పాటు వీరిని సస్పెండ్ చేసినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఎయిర్‌లైన్స్ ప్రతిరోజూ తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బందిలో 50శాతం మందికి ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించాలని డిజిసిఎ గత నెల పేర్కొంది. దేశంలోకరోనా మహమ్మారి ప్రబలడానికి ముందు విమాన సిబ్బంది అందరూ విధులకు వెళ్లే ముందు ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవలసిఉండేది. అయితే కరోనా ప్రబలిన తర్వాత ఈ పరీక్షలను రెండు నెలల పాటు నిలిపి వేశారు. దరిమిలా ఈ పరీక్షలను తిరిగి ప్రారంభించినప్పటికీ తక్కువ శాతం సిబ్బందికి మాత్రమే నిర్వహించే వారు.