కరాచీ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బెలూచిస్థాన్‌లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో తొమ్మండుగురు పోలీసులు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. బైక్‌పై వెళ్లుతున్న మానవబాంబు గురిచూసుకుని బెలూచిస్థాన్ కానిస్టేబులరీ దళానికి చెందిన పోలీసులను తీసుకువెళ్లుతున్న శకటంపైకి దూసుకువెళ్లింది. ఈ మానవబాంబు తన దుస్తులలో పేలుడు పదార్థాలను అమర్చుకుని ఉండటం, వ్యాన్‌ను వేగంగా ఢీకొనడంతో జరిగిన పేలుడు ఈ మార్గంలో విధ్వంసానికి దారితీసింది.
సిబి నుంచి క్వెట్టాకు భద్రతా బలగాలు తిరిగి వస్తుండగా బోలాన్‌లోని కున్‌బ్రీ పర్వతాల మధ్య ఆత్మాహుతి దాడి జరిగింది.ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో బలూచ్ తిరుగుబాటుదార్లు , ఇస్లామిక్ మిలిటెంట్లు తరచూ భద్రతా బలగాలను లక్షంగా చేసుకుని దాడులకు పాల్పడటంతో పలువురు బలి అవుతున్నారు. ఆదివారం ముగిసిన సిబి ఉత్సవాల వద్ద తమ భద్రతా విధుల నిర్వహణ తరువాత జవాన్లు వ్యాన్‌లో వస్తున్నారని , ఈ దశలోనే ఆత్మాహుతి దాడి జరిగిందని సీనియర్ పోలీసు అధికారి మహమ్మూద్ నొటెజాయి తెలిపారు.
ఉగ్రవాదులు తొలుత సిబి ఉత్సవాలలోనే దాడికి దిగాలని సంకల్పించారని, అయితే భారీ స్థాయి భద్రతా ఏర్పాట్లతోవారి యత్నాలు ఫలించలేదని, దీనితో క్వెట్టాకు తరలివచ్చే భద్రతా బలగాలను లక్షంగా ఎంచుకుని దాడికి దిగారని వివరించారు. బైక్‌ను అత్యంత వేగంగా నడుపుతూ వ్యాన్‌లోకి దూసుకువెళ్లేలా చేసి ఈ వ్యక్తి తనను తాను పేల్చకున్నాడని వెల్లడైంది.