Monday, January 20, 2025

కేరళ తో పాటు పలు రాష్ట్రాలను వణికిస్తున్న నిఫా వైరస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేరళతో పాటుగా పొరుగు రాష్ట్రాలను సైతం వణికిస్తున్న నిఫా వైరస్ సోకిన వారికి చికిత్స కోసం మనదేశం ఆస్ట్రేలియా నుంచి మరో 20 డోసులు మోనోక్లోనల్ యాంటీ బాడీస్‌ను కొనుగోలు చేయనుంది. ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ శుక్రవారం ఈ విషయం తెలియజేశారు. 2018లో ఆస్ట్రేలియా నుంచి కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీ డోసులను పొందామని, ప్రస్తుతం పది మంది రోగులకు మాత్రమే ఈ డోసులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. కాగా ఇప్పటివరకు మన దేశంలో ఎవరికి కూడా ఈ మందును ఇవ్వలేదని కూడా ఆయన చెప్పారు. ‘మరో 20 డోసుల మందును ప్రొక్యూర్ చేస్తున్నాం. అయితే ఈ మందును వైరస్ సోకిన ప్రారంభ దశలోనే ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఆయన చెప్పారు. ఈ మందును కేవలం ఊరట కలిగించే మందుగానే ఇస్తారని కూడా ఆయన చెప్పారు. కొవిడ్‌లో మరణాల రేటు 2 3శాతం మాత్రమే ఉంటే నిఫావైరస్ సోకిన వారిలో లో మరణాల రేటు చాలా ఎక్కువగా 40- 70శాతం వరకు ఉంటుందని బహల్ చెప్పారు.కాగా కేరళలో ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి అన్ని చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.

కేరళలో ఈ వైరస్ సోకిన రోగులందరు కూడా ఈ లక్షణాలున్న రోగితో కాంటాక్ట్ ఉన్న వారేనని ఆయన చెప్పారు. కేరళలో ఈ వైరస్ ఎందుకు వెలుగు చూసిందని అడగ్గా అది తమకు తెలియదని ఆయన చెప్పారు. 2018లో కేరళలో ఈ వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందినట్లు గుర్తించామని ఆయన చెప్పారు. అయితే గబ్బిలాలనుంచి మనుషులకు ఇది ఎలా వ్యాప్తిచెందిందో తాము కచ్చితంగా చెప్పలేమని, ఈ లింక్‌ను నిర్ధారించాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ సారి ఈ విషయాన్ని గుర్తించడానికి తాము మళ్లీ ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఇది ప్రతిసారీ వర్షాకాలంలోనే జరుగుతోందని ఆయన తెలిపారు. దేశం వెలుపల కేవలం 14 మంది ఈ వైరస్ సోకిన రోగులకు మాత్రమే మోనోక్లోనల్ యాంటీబాడీని ఇవ్వడం జరిగిందని, వారంతా కూడా ప్రాణాలతో బైటపడ్డారని ఆయన చెప్పారు. ఈ మంది సేఫ్టీని నిర్ధారించడానికి జరిగిన ఫేజ్1 ట్రయల్స్ మాత్రమే దేశం వెలుపల జరిగాయని ఆయన చెప్పారు. అయితే ఈ యాంటీబాడీని ఉపయోగించాలనే దానిపై నిర్ణయంతీసుకోవలసింది కేరళ ప్రభుత్వంతో పాటు డాక్టర్లు, రోగి కుటుంబ సభ్యులు మాత్రమేనని కూడా బహల్ స్పష్టం చేశారు.

కేరళలో మరో వ్యక్తికి పాజిటివ్
ఇదిలా ఉండగా కేరళలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. 39 ఏళ్ల మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.దీంతో రాష్ట్రంలో నిఫా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. వైరస్‌తో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు. కాగా వైరస్ వ్యాప్తితో శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు బంద్ చేశారు. వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండడంతో కాంటాక్ట్ లిస్ట్లు కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 950 మంది కాంటాక్ట్ లిస్టులో ఉండగా 213 మంది అధిక ముప్పు జాబితాలో ఉన్నారు. కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారిలో 287 మంది హెల్త్ వర్కర్లే ఉండడం గమనార్హం. అధిక ముప్పు ఉన్న 15 మంది శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. మరో వైపు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయతీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఎ గీతా తెలిపారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా వేసి ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత దుకాణాలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News