12ఏళ్ల బాలుడు మృతి
ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు లక్షణాలు
కోజికోడ్ : కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్‌లో ఈ వైరస్ బారిన పడి 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి ప్రకటించారు. శనివారంనాడు తీవ్ర అస్వస్థతకు గురైన బాలునికి చికిత్స అందిస్తుండగానే ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. బాలుడి నమూనాలను ముందే పుణె లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా నిఫా వైరస్ ఉన్నట్టు తేలింది. బాలునితో కాంటాక్ట్ ఉన్న వారందరినీ గుర్తించే ప్రక్రియను గత రాత్రి ప్రారంభించామని మంత్రి తెలిపారు. వారందరినీ ఐసోలేషన్ కి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై కేరళ ఆరోగ్యశాఖకు సహకారంగా ప్రత్యేక వైద్య బృందాన్ని పంపింది.
కేరళలో 2018 జూన్లో తొలిసారి నిఫా వైరస్ బయటపడింది. మొత్తం 23 కేసులను నిర్ధారించారు. వీరిలో ఇద్దరు మాత్రమే కోలుకున్నారు. 2019 లో మరోసారి ఈ వైరస్ ఒకరికి సోకింది. ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో ఆ ఒక్క కేసుతోనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. నిఫా వైరస్‌తో మృతి చెందిన బాలునికి దగ్గరగా ఉన్న 20 మంది హైరిస్కు కాంటాక్టులో ఉన్నారని, వారిలో ఇద్దరికి లక్షణాలు ఉన్నాయని మంత్రి వీణాజార్జి చెప్పారు. ఇప్పటివరకు 188 మంది కాంటాక్టులను గుర్తించామని, నిఘా బృందం వారిలో 20 మందిని హైరిస్కు కాంటాక్టులుగా గుర్తించిందన్నారు.