కేరళలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం వెల్లడించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. అతడికి వైరస్ సోకినట్టు నిర్ధారించిన కొన్ని గంటల వ్యవధి లోనే మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకినట్టు వీణా జార్జ్ శనివారమే వెల్లడించారు. పుణె లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) ఈ విషయాన్ని నిర్ధారించిందని తెలిపారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. అతడు వెంటిలేటర్‌పై ఉన్నాడని పేర్కొన్నారు. బాధితుడిని కోజికోడ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించనున్నట్టు తెలిపారు. అతడికి ఎవరెవరు దగ్గరగా వచ్చారన్నది ఆరా తీస్తున్నట్టు వివరించారు. ఇంతలోనే బాలుడు మృతి చెందడం గమనార్హం. ఆదివారం ఉదయం బాలుడికి మూత్రం ఆగిపోయిందని, ఉదయం 10.50 కి తీవ్ర గుండెపోటు వచ్చిందని మంత్రి తెలిపారు. బతికించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్టు వెల్లడించారు.
ఉదయం 11.30కు బాలుడు మరణించినట్టు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు , ఇతర కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మలప్పురం జిల్లాలో నిఫా వ్యాప్తికి పాండిక్కాడ్ కేంద్రంగా ఉంది. ప్రజలు, సమీప ఆస్పత్రులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, ఆస్పత్రుల్లో రోగుల వద్దకు వెళ్లొద్దని ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని వీణా జార్జి పేర్కొన్నారు. పుణె ఎన్‌ఐవీలో నిల్వ చేసిన ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిన మోనోక్లోవల్ యాంటీబాడీ ఆదివారం రాష్ట్రానికి వస్తుందని మంత్రి ప్రకటించారు. ఆరోగ్యశాఖ మంజేరి మెడికల్ కాలేజీలో 30 ఐసొలేషన్ గదులు , ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేసి వైరస్ సోకిన బాలుడితో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరినీ ఐసొలేట్ చేసినట్టు చెప్పారు. బాలుడితో కాంటాక్ట్ అయిన 214 మందిని అబ్జర్వేషన్ లో ఉంచినట్టు తెలిపారు. వీరిలో 60 మందిని హైరిస్కు కేటగిరీగా గుర్తించి వారిని ఐసొలేట్ చేశారు. వారి నుంచి శాంపిల్స్‌సేకరించి పరీక్షిస్తున్నారు. మరోవైపు మలప్పురంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ వైరస్ ప్రబలిన ప్రదేశానికి మూడు కిమీ మేర ఆంక్షలు విధించే అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.
నిఫా వ్యాప్తి ఇలా …
నిఫా వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. దీన్ని జునోటిక్‌గా పేర్కొంటారు. తొలిసారి దీన్ని 1999 లో గుర్తించారు. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఈ గబ్బిలాలు పండ్లపై వాలితే వాటిని తీసుకోవడం ద్వారా వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది.
నిఫా రోగి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరిలో లక్షణాలు కనిపించవు. మరికొందరిలో మాత్రం తీవ్ర శ్వాస ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. తొలుత జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురు పోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. మెదడు దెబ్బ తినడం, వణికిపోవడం, నిమోనియా, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా రోగి 24 గంటల నుంచి 48 గంటల్లో కోమా లోకి చేరుకుంటాడు.
కచ్చితమైన వైద్యం లేదు.
ఈ వైరస్‌కు కచ్చితమైన వైద్యం ఏదీ లేదు. ఇప్పటివరకు అనుమతి పొందిన ఏ ఔషధం అందుబాటు లోకి రాలేదు. మోనో క్లోనల్ యాంటీ బాడీస్ చికిత్స విధానం వినియోగించడంపై పరిశీలిస్తున్నారు. కరోనా మాదిరిగానే కాంటాక్ట్, ట్రేసింగ్, క్వారంటైన్, ఐసొలేషన్ వంటి చర్యలు తీసుకుంటారు. 2018లో కేరళ ప్రభుత్వం సమర్ధంగా నిఫా వైరస్‌ను అరికట్టగలగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఫ్రూట్ బ్యాట్స్, పందులకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రాంతాల్లో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడంతోపాటు , శుచి, శుభ్రత పాటించాలి.