వ్యవసాయంలో తెలంగాణకు ప్రపంచంలోని ఆధునిక దేశాలతో మాత్రమే పోటీ
తెలంగాణ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది
రైతు కేంద్రంగా సాగే ఏకైక రాష్ట్రం తెలంగాణ -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మహబూబ్ నగర్: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని జేజేఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వానకాలం సాగు 2022-23పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గడిచిన 8 సంవత్సరాలలో సాగుపై మూడు లక్షల 75వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. తెలంగాణలో అనతికాలంలోనే వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చి దేశంలోనే రికార్డు స్థాయిలో పంటలు పండిస్తున్నామని, మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండించిన ఘనత తెలంగాణది ఆని, తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి చెందినందునే జీవన ప్రమాణాలు పెరిగాయని అన్నారు. రానున్న రోజులలో రైతు వేదిక ద్వారా పాఠశాలల మాదిరిగా రైతులకు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు పండించే విధానం పై శిక్షణ ఇస్తామని తెలిపారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలనే వేయాలని, పంటల మార్పిడి జరగాలని, అవసరాన్ని బట్టి పంటలు వేయాలని, భూసార పరీక్షలు, ఎరువులు, వ్యవసాయ యాంత్రీకరణ, పనిముట్లు పై అవహహన కల్పించాలన్నారు. దళిత బందు కింద గ్రామాలలో వ్యవసాయ పనిముట్ల యూనిట్లు తీసుకున్నట్లయితే రైతులకు ఉపయోగపడతాయని తెలిపారు. ఎప్పుడు వేసే సాధారణ పంటలు కాకుండా మల్బరీ తోటలను పండించాలని, అంతేకాక నూనె, పప్పు దినుసులు, ఆయిల్ పామ్, ఆముదం వంటి వాటిని వేయాలని సూచించారు. పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలన్నారు
వ్యవసాయాధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలని, రైతులతో మమేకం కావాలని, తెలంగాణ వ్యవసాయం విషయంలో ప్రపంచంలోని ఆధునిక దేశాలతో పోటీ పడుతుందని తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు 2014 పూర్వం, ఇప్పటి వ్యవసాయంతో పోల్చుకోవాలని, గతంలో నదులు ఉన్నప్పటికీ మహబూబ్నగర్ లాంటి జిల్లాకు సాగునీరు అందేది కాదు అని, ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డెబ్బై నుండి ఎనభై శాతం పొలాలకు సాగునీరు అందుతున్నదని, పాలమూరు-రంగారెడ్డి పూర్తయితే 100% అందుతుందని అన్నారు. రైతులు వివిధ విధానాలలో పంటలు సాగు చేయాలని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా ,రైతు వేదికలను ఏర్పాటు చేసిందని తెలిపారు. మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యులు మన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు ద్వారా రైతులు బలోపేతం అయ్యేలా చేశామని, విద్యుత్తు, నీటిపారుదల సౌకర్యలు కల్పించామని తెలిపారు. నారాయణపేట శాసనసభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డ్ మాట్లాడుతూ గతంలో రైతులకు సాగు విధానం పై సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవని, ఇప్పుడు రైతు వేదికల ద్వారా మారిన పరిస్థితులను రైతులకు తెలియజేస్తున్నామని, రైతు కేంద్రంగా ప్రభుత్వం పని చేస్తున్నదని నారాయణపేట జిల్లాలో ఉద్యాన తోటలను ప్రోత్సహించాలని తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని, వచ్చే వారం రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యవసాయ అధికారులు రైతుల సంక్షేమానికి పని చేయాలని, రైతు వేదికలో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్ర రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత నే రైతులకు గుర్తింపు వచ్చిందని, పంట సాగు నుండి పంట నూర్పిడి వరకు రైతులకు అన్ని వివరంగా తెలియ చేయాలని, 7800 కోట్ల రూపాయలు వచ్చేవారం రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులు జమ చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 83 వేల మంది చనిపోయిన రైతులకు రైతు బీమా ఇచ్చామని, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో 5500 మంది రైతులు ఇచ్చినట్లు తెలిపారు. రైతుబంధు సమన్వయ సమితి కోఆర్డినేటర్ల గౌరవ వేతనం కోసం కృషి చేస్తామని వెల్లడించారు.
ఈ సదస్సులో మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాల జెడ్పి చైర్ పర్సన్లు స్వర్ణ సుధాకర్ రెడ్డి, వనజ, ఎమ్మెల్సీ వాణి దేవి, రాష్ట్ర గిడ్డంగుల సహకార సంస్థ చైర్మన్ సాయి చంద్, గిరిజన కార్పొరేషన్ అధ్యక్షుడు బాల్య నాయక్, జిల్లా కలెక్టర్లు ఎస్. వెంకట రావు, హరిచందన, డిసిసిబి అధ్యక్షులు నిజాం పాష, ఉపాధ్యక్షులు వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు శాంతయ్య యాదవ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయంపై రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు.
Niranjan Reddy about farming in Mahabubnagar