ప్రపంచ విత్తన రంగాన్ని శాసించే స్థాయికి తెలంగాణ ఎదగాలి
యువతకు వ్యవసాయమే భవిష్యత్తు: మంత్రి నిరంజన్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన రంగాన్ని శాసించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. గురువారం రెడ్ హిల్స్ ఫ్యాప్సీలో జరిగిన సీడ్స్ మెన్ అసోసియేషన్ 27వ వార్షిక సమావేశంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 20దేశాలకు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ రకాల మేలురకం విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని, మరిన్నిదేశాలకు విత్తనాలు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని సూచించారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి 7 లక్షల మంది విత్తనోత్పతి రైతులు ఉన్నారని తెలిపారు. రాబోయే రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా భారతదేశం సగౌరవంగా నిలుస్తుందని వెల్లడించారు. యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపితేనే దేశ భవిష్యత్ కు మేలు చేస్తుందన్నారు. యువత ఈ రంగం వైపు ఆత్మ విశ్వాసంతో అడుగులు వేసేలా తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ విత్తనరంగాన్ని శాసించే స్థాయికి తెలంగాణ ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యమైన విత్తనం రైతుకు అందాలన్నారు. నిరంతర పరిశోధనలతోనే ప్రగతి సాధ్యమన్నారు. పరిశోధనల మూలంగానే చిన్న దేశమైనా ఇజ్రాయిల్ ప్రపంచదేశాలు తనను అనుసరించేలా చేస్తోందని తెలిపారు. విత్తనరంగంలో విత్తన కంపెనీలు మరిన్ని పరిశోధనలు నిర్వహించాలని కోరారు. అందుకు ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కాలక్రమంలో పంటల సాగు విధానం మారుతూ వస్తోందని వివరించారు. ఒకప్పుడు వానాకాలం పండించే వేరుశెనగ ఇప్పుడు యాసంగిలో పండిస్తున్నారని, తాజాగా పత్తి సాగు యాసంగిలో వేస్తున్నారు తెలిపారు. ఖమ్మం జిల్లాలో వెంకటేశ్వర్లు అనే రైతు యాసంగిలో పత్తి సాగు చేసి 18 క్వింటాళ్లు సాధించారని వెల్లడించారు. రైతును మించిన శాస్త్రవేత్తలు లేరు అనడానికి ఇది నిదర్శనం అన్నారు. విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కేంద్రం దృష్టి సారించడం లేదని అసంతృప్తిని వెలిబుచ్చారు. దేశం నుండి ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో అనేక ఆంక్షలు పెడుతున్నారని ఆరోపించారు. ఇతర దేశాల నుండి అనేక ఉత్పత్తులు అడ్డగోలుగా దిగుమతి అవుతున్నాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళీధర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఏఎస్‌ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Niranjan Reddy attends Seedsmen association 27th annual meeting