హైదరాబాద్: కోటి 47 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 64.95 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.7372.56 కోట్లు జమ చేశామని, రైతుబంధు నిధుల పంపిణీ పూర్తి కావస్తుందన్నారు. ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తప్పుపట్టారు. వరదలపై విపక్షాలది బురద రాజకీయం మానుకోవాలని చురకలంటించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి వరద బాధితులకు సహాయం అందిస్తున్నారని ప్రశంసించారు. విపక్ష నేతలు పార్టీ ఆఫీసుల్లో మీడియా ముందు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరికి 500 ఏళ్ల తర్వాత భారీ వరదలు వచ్చాయని, కాళేశ్వరం పంప్ హౌజ్ ల నీటమునకపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, పంప్ హౌస్ లు అనేవి ప్రాజెక్టుల పక్కనే ఉంటాయన్న కనీస ఇంగితజ్ఞానం కాంగ్రెస్, బిజెపి నేతలకు లేదని మండిపడ్డారు.
ఎంత సేపు ప్రభుత్వాన్ని, కెసిఆర్ ను బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప, అభివృద్ధి గురంచి విపక్షాలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వ వరద సాయం ఏదని అడిగారు. వరదలో సమయంలో గుజరాత్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం సాయం చేసిందని, ఇప్పుడు తెలంగాణకు ఎందుకు సాయం చేయడం లేదని బిజెపి నేతలను ప్రశ్నించారు. తెలంగాణ బిజెపి నేతలు మాట వరసకైనా తెలంగాణకు వరద సాయం ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు, తెలంగాణకు నిధుల కేటాయింపు, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదా, తెలంగాణకు వర్శిటీలు, మెడికల్ కళాశాలల కేటాయింపు, తెలంగాణ ప్రభుత్వ రుణాల సేకరణ వంటి ప్రతి విషయంలో కేంద్రం అడ్డకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అడ్డంకులను అధిగమించి ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వ పథకాలను సజావుగా కొనసాగిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్షకు ప్రజలు సరైన సమయంలో సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారన్నారు.
గారు