Saturday, November 16, 2024

వరి తొండిపై క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం మొసలికన్నీరు
సిఎంకు బండి సంజయ్ లేఖ సిగ్గు పడేలావుంది
రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానికి లేఖరాయండి:మంత్రి నిరంజన్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొసలి కన్నీరు పెడుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం మంత్రి ఎంపి బండి లేఖపై స్పందించారు. రైతులను రెచ్చగొట్టి పక్కకు తప్పుకున్న బండి సంజయ్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి భాగ్యలక్ష్మి గుడి దగ్గర ముక్కునేలకు రాయాలన్నారు.రైతుబంధుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, రూ.7500 కోట్లకు రూ.580 కోట్లకు తేడా ఎంతో బండి సంజయ్ ఎవరినన్నా లెక్కలడిగి తెలుసుకోవాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏటా రైతుల కోసం రైతుబీమాకు చేస్తున్న ఖర్చు రూ.1500 కోట్లు అన్నారు. రైతుబంధు పథకం గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కి లేదన్నారు. పంటలకు మద్దతుధర గురించి శభాష్ .. శభాష్ అని బండి సంజయ్ చెప్పుకుంటున్నాడని, వరి ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.3054, కాగా తాజాగా పెంచిన దాని ప్రకారం కేంద్రం క్వింటాలుకు ఇస్తున్న మద్దతుధర రూ.2060 అన్నారు. బండి సంజయ్ కు మద్దతుధరలపై అవగాహన శూన్యం కాబట్టి కనీసం పత్రికలు అయినా చదివి వివరాలు తెలుసుకోవాలన్నారు.కేంద్రం మద్దతుధరలు ప్రకటించిన 14 పంటలలో పొద్దుతిరుగుడు మినహా మరే పంట సాగుచేసినా రైతులకు గిట్టుబాటు కాదన్నారు.బండి కి చేతనయితే గతంలో ప్రధాని మోడీ ఇచ్చిన వాగ్దానం మేరకు స్వామినాధన్ కమిటీ సిఫారసుల ప్రకారం సీ ప్లస్ 50 ప్రకారం పంటలకు మద్దతుధరలు ప్రకటించాలని ,లేకుంటే నోరు మూసుకొని కూర్చోవాలన్నారు.రైతుల సంక్షేమం రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటు, సాగునీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, చేతనయితే ఈ పథకాలు కేంద్రం చేత రైతులకోసం దేశమంతా అమలుచేయించాలని డిమాండ్ చేశారు.నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి 16 నెలల రైతుల పోరాటానికి తలొగ్గి క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కు తీసుకున్న చరిత్ర ప్రధాని నరేంద్రమోడీదన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లిన కేటీఆర్ ను విమర్శిస్తున్న బండి సంజయ్ ప్రధాని నరేంద్రమోడీ ఎనిమిదేళ్లలో విదేశీ పర్యటనల ఖర్చు, ఆయన వేసుకునే సూటు, బూటులకు అయిన ఖర్చు సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెచ్చుకుని చదువుకుంటే మంచిదన్నారు.వ్యవస్థ మీద, సమాజంలోని సమస్యల మీద ఏ మాత్రం ఆవాహనం లేని, అవగాహన తెచ్చుకోలేని బండి సంజయ్ లాంటి నేతలకు పదవులు ఇవ్వడం పిచ్చోడి చేతిలో రాళ్లుగా మారాయన్నారు. ఇటీవల బీజేపీ నుండి సస్పెండ్ అయిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లను చూశాకయినా బండి సంజయ్ సిగ్గుతెచ్చుకుని భాష మార్చుకోవాలని హెచ్చరించారు.ఫసల్ భీమా పథకంలో అంత పస ఉంటే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలుచేయడం లేదో అడిగి తెలుసుకోవాలన్నారు. పాలమూరు పాదయాత్రలో ఆర్డీఎస్ అంతటికీ సాగునీళ్లు, ఆరునెలల్లో సమస్య పరిష్కారం అని చెప్పిన బండి సంజయ్ ఆ పనులు ఎంతవరకు వచ్చాయో పాలమూరు ప్రజలకు చెప్పాలన్నారు. హైదరాబాద్ కార్పోరేటర్లతో ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పావలా అయినా హైదరాబాద్ అభివృద్ధి కొరకు తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.పత్రికా ప్రకటనల్లో బట్టలు చించుకోవడం మినహా బీజేపీ నేతలు రాష్ట్రానికి తెచ్చిన నిధులు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు ఏమున్నాయో ప్రజలు గమనించాలన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల గురించి రైతుల బాధల గురించి, ప్రభుత్వ బాధ్యతల గురించి బండి సంజయ్ చెప్పడం తాతకు దగ్గు నేర్పినట్లు ఉందన్నారు. ముఖ్యమంత్రి లేఖ రాసే బదులు 30,000 కోట్ల పై చిలుకు కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని దమ్ముంటే ప్రధానికి లేఖ రాయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Niranjan Reddy slams Centre Govt over Paddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News