Sunday, January 19, 2025

బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహారిస్తోంది

- Advertisement -
- Advertisement -

Niranjan Reddy Speech at TRS Australia Meet and Greet

బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహారిస్తోంది
ప్రధాని మోడీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేశారు
ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ
దేశానికి పన్నుల రూపంలో అధిక వాటా తెలంగాణ ఇస్తోంది
టిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా మీట్ అండ్ గ్రీట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహారిస్తోందని, ప్రధాని మోడీ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేశారని, పదహారు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఆస్ట్రేలియా దేశానికి వెళ్లిన మంత్రి నిరంజన్ రెడ్డితో టిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా విభాగం ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రికి విక్టోరియా ఇన్‌ఛార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు బిజెపి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్‌గా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ కోతలు లేవని, తాగునీటి వెతలు లేవని, వలసలు అసలే లేవన్నారు.

దేశానికి పన్నుల రూపంలో అధిక వాటా తెలంగాణ ఇస్తుందని ఆయన గుర్తుచేశారు. బిజెపికి ఒక విధానం, నినాదం లేదని, కేవలం విద్వేషాలను రెచ్చగొట్టడమే వాళ్ల ఎజెండా అని ఆయన విమర్శించారు. దేశంలో మత రాజకీయంతో విద్వేష రాజకీయాలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. బిజెపి పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. దేశాన్ని గడిచిన ఎనిమిదేండ్లుగా సాగుతున్న మోడీ పాలనలో దారిద్య్రం మరింత పెరిగి పోయిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో సబ్బండ వర్గాలు, అన్ని మతాల ప్రజలు సర్వతోముఖభివృద్ధితో సంతోషంగా ఉన్నారని, నేటి కెసిఆర్ పథకాలు, సంస్కరణలు నేటి రేపటి తరాలకు వరంగా మారాయని మంత్రి తెలిపారు. అనంతరం ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, పేదలు రెండు కళ్లు అని, సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపిన దార్శనికుడు సిఎం కెసిఆర్ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో కెసిఆర్ నాయకత్వం అవసరమని ఎన్నారైలంతా కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జై కెసిఆర్, జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సభ్యులు విశ్వామిత్ర, సతీష్, వినయ్ సన్నీ, ప్రవీణ్ లేదెళ్ల, విక్రమ్ కందుల, ఉదయ్, సాయి యాదవ్, వేణు నాన, రాకేష్, సాయి గుప్తా, సందీప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Niranjan Reddy Speech at TRS Australia Meet and Greet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News