వ్యవసాయ సదస్సులతో మారనున్న సాగు దశ దిశ
పంటల వైవిధ్ధీకరణకు మొగ్గుచూపుతున్న రైతాంగం
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ సదస్సుల వల్ల సాగు దశ-దిశ మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతాంగం పంటల వైవిద్దీకరణకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ సదస్సుల విజయవంతానికి సహకరించిన అందరికీ మంత్రి ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. అవసరానికి మించిన వరి సాగు వల్ల కలిగే దుష్ఫరిణామాలను గమనించి దేశంలో తొలిసారి వ్యవసాయ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపు వల్ల సాగునీటి రాకతో 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటి 34 లక్షల ఎకరాల నుండి 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. 2014 నాటికి 45 లక్షల టన్నులు ఉన్న ధాన్యం ఉత్పత్తి 3 కోట్ల టన్నులకు చేరుకుందన్నారు. లక్షన్నర కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు, రూ.28,473 కోట్లు వెచ్చించి వ్యవసాయ విద్యుత్ మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని ఏటా దాదాపు రూ. 10,500 కోట్లు భరిస్తూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతోందన్నారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటివరకు రూ. 50,447.33 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఎల్లుండి నుండి తొమ్మిదోవిడత రైతు బంధు నిధులు రైతుల ఖాతాలో జమకానున్నాయని తెలిపారు. రైతు బీమా పథకం ద్వారా ఇప్పటివరకు 83,118 మంది రైతు కుటుంబాలకు రూ.4150.90 కోట్లు పరిహారం అందిజేసినుట్లు మంత్రి వివరించారు.
సీజన్‌కు ముందే ఏ పంటలు వేయాలో, రైతులకు సూచించడానికి దేశంలోనే తొలిసారిగా మార్కెట్ రిసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రత్యామ్నయ పంటలను ప్రొత్సహించడంలో భాగంగా 20 లక్షల ఎకరాలలో సాగు లక్షంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వరికి ప్రత్యామ్నయంగా పత్తి సాగుతో పాటు పప్పు, నూనెగింజల సాగుకు ప్రోత్సాహం, కందులు, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, పప్పుశెనగ, పొద్దుతిరుగుడు, మినుములు, పెసలు సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రైతు వేదికలలో సమావేశాలతో పాటు క్షేత్ర స్థాయి పర్యటనలతో వ్యవసాయ అధికారులు రైతులను పంటల మార్పిడి దిశగా చైతన్యం చేయాలన్నారు. రైతులతో వ్యవసాయ అధికారుల అనుబంధం మరింత పెరగాలని మంత్రి చెప్పారు. రైతు వేదికలలో వ్యవసాయ అధికారులతో పాటు అన్ని శాఖల అధికారులు రైతులకు సేవలు అందించేందుకు రైతు వేదికలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు రైతులకు సంబంధించిన అన్ని సభలు, సమావేశాలకు రైతువేదికలను ఉపయోగించుకోవాలన్నారు.
తెలంగాణ వ్యవసాయం దేశానికే దిక్సూచిలా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. పంటల మార్పిడి ఆవశ్యకత ప్రతి రైతుకూ చేరాలని, పంటల వైవిధ్ధీకరణతో రైతులు పంట సాగు పెట్టుబడులు తగ్గించుకుని, అధిక ఆదాయం పొందాలన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గి పచ్చిరొట్ట ఎరువుల వాడకం పెద్ద ఎత్తున పెరగాలని మంత్రి సూచించారు. యూరియా వంటి ఎరువులు కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు వినియోగించాలని, పంటల సాగు విషయంలో రైతులను ఎవరు తప్పుదారి పట్టించేందుకు వీలులేకుండా గట్టి సందేశం ఇవ్వాలన్నారు. సదస్సుల్లో జాతీయ, అంతర్జాతీయ గణాంకాలు, వివరాలతో కూడిన ఉపస్యాసాలు ఎంతో అకట్టుకున్నాయని మంత్రి వెల్లడించారు. ఏప్రిల్ 25 నుండి జూన్ 24 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, గ్రామ, మండల స్థాయి రైతు బంధు సమితుల ప్రతినిధులు, మార్కెట్ కమిటి చైర్మన్లు, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, జడ్‌పి చైర్మన్లతో నిర్వహించిన 17 వ్యవసాయ సదస్సులు విజయవంతం అయ్యాయని వివరించారు.
Niranjan Reddy speech over Agriculture Sadassu Meetings