స్త్రీని గౌరవించాలి, స్త్రీకి విలువనివ్వాలి. స్త్రీకి సమానత్వాన్నిచ్చి సమాజంలోవారి అభ్యున్నతిని పెంచాలని కొందరు కృషి చేసినప్పటికీ స్త్రీని కేవలం అవసరాలకు ఉపయోగపడే ఆట బొమ్మగా భావించే వాళ్ళు కూడా వున్నారు. అమ్మాయి పుడితే ఆనందించే వారి కన్నా బాధ పడేవారి సంఖ్యే ఎక్కువ. ఎందుకంటే చిన్నతనం నుండి ఆమెను కొన్ని మానవ మృగాల నుండి కాపాడుకుంటూ ఆమెను విద్యావంతురాల్ని చేసి సమాజానికి ఉపయోగపడే ఒక ఆదర్శవంతురాలిగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల జీవితాలకు అతి పెద్ద సవాల్‌గా మారిపోయింది.
పూర్వం స్త్రీని విద్యాభ్యాసానికి కూడా బయటకు పంపకుండా, ఎవరికీ కనపడకుండా పెంచి, పెళ్ళి చేసి పంపించే వారు. అయితే కొందరు సంఘ సంస్కర్తలు, అభ్యుదయవాదులు ఆ పద్ధతి కరెక్టు కాదని, స్త్రీని అలా నిరక్షరాస్యురాలిగా చేయడం తప్పు అని, స్త్రీ చదువుకుంటే కుటుంబానికి ఉపయోగపడుతుందని, స్త్రీకి స్వేచ్ఛతో పాటు తనకున్న హక్కులని తెలుసుకొని, తన ఆశలను, కోరికలను నెరవేర్చుకోవడంతో బాటూ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని భావించి, స్త్రీ జీవితంలో మార్పు తీసుకొచ్చారు. ఎందరో కృషి చేయగా ఈ మార్పు వచ్చింది. అయితే స్త్రీల పై జరుగుతున్న అత్యాచారాలు, యాసిడ్ దాడులు, అవమానాలు, లైంగిక వేధింపులు వంటివి అడుగడుగునా వారి అభ్యున్నతికి ఆటంకాలుగా మారిపోయాయి. కాలం మారుతున్నా, టెక్నాలజీ పెరిగి, పరిజ్ఞానంతో ఎంతో మార్పు వచ్చినప్పటికీ కూడా ప్రతి రోజూ ఈ దుర్ఘటనలు మన ముందుకి వస్తూనే వున్నాయి.
కొన్ని సంఘటనలు గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో జరిగితే, కొన్ని భయంకర సంఘటనలు నగరాల్లోనూ, రాజధానుల్లోనూ జరిగి విశేష స్పందనతో మానవ సమాజాన్ని కుదిపేశాయి. అన్నింటినీ మించి దేశంలో అలజడి రేగి దేశ ప్రజలంతా అవాక్కయ్యేలా దేశ రాజధానిలో జరిగిన “నిర్భయ ఘటన” 2012 డిసెంబర్ 16న జరిగింది. ఈ ఘటన జరిగి పదేళ్ళు పూర్తి అయినా ఇలాంటి దుర్ఘటనలు జరక్కుండా ఒక్క రోజు కూడా మనం చూడలేకపోవడం అతి పెద్ద విశేషం. అంటే మన సమాజం, మన వ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలు స్త్రీకి రక్షణ కల్పించడంలో విఫలమయ్యాయనే చెప్పాలి. పది సం॥ల క్రితం అతి క్రూరంగా అత్యాచారం చేసి, హింసించి “నిర్భయ” మరణానికి కారణమైన వ్యక్తులు ఆరుగురు శిక్షించబడ్డారా? అనే ప్రశ్నకు సమాధానంగా మన చట్టాలలో పొందు పరచిన రూల్స్‌ని బట్టి నేరస్థులకు శిక్షలు వెంటనే అమలు చేయలేదనే చెప్పాలి.
ఎందుకంటే చట్ట పరిధిలో నేరాన్ని రుజువు చేయడమే ప్రధానం కాకుండా, వారి వయో పరిమితులు, మానసిక పరిస్థితులు, ఇతర కారణాలు వంటివి కాలయాపనకు కొమ్ముకాస్తాయి. కాని నిర్భయ బాధను తలచుకుంటే ప్రతి మానవ హృదయం ద్రవించిపోతుంది. అయితే నేరస్థులు 7 సం॥ లు జైల్లో అన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తూ హ్యాపీగా వున్నారని కొందరి అభిప్రాయం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తి స్వేచ్ఛను పొంది, జీవించే హక్కు కలిగి వున్నాడు. అయితే డెత్ పెనాల్టీని తీసేయాలని కొందరు భావిస్తున్నందున ఇవి పునరావృతమవుతున్నాయి. చట్టం లో వున్న కొన్ని వెసులుబాటుల వల్ల కాలాతీతం జరుగుతుంది. నేరస్థుల రివ్యూ పిటిషన్ కొట్టి వేసిన తర్వాత కూడా వారు మెర్సీ పిటిషన్ పెట్టుకొని రాష్ట్రపతి క్షమాభిక్షపై అభ్యర్థించారు. క్యూరేటివ్ పిటిషన్‌ను కూడా పెట్టుకున్నారు.
ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతి నేరస్థులను శిక్ష నుండి విముక్తులను చేయవచ్చు లేదా శిక్షను తగ్గించే సర్వత్రా అధికారాలను కలిగి వున్నారు. కాని వీరు ఎన్ని రకాలుగా అభ్యర్థనలు పెట్టుకొన్నా అన్ని కొట్టి వేయబడ్డాయి. వీరి మృగత్వానికి, క్రూరత్వానికి బలైన నిర్భయను మన దేశం నుండి మెరుగైన వైద్యం నిమిత్తం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజిబెత్ హాస్పిటల్‌కు డిసెంబర్ 27 2012 తేదీన తరలించారు. కాని ఆమె డిసెంబర్ 29 2012న మరణించింది. అయితే 2013 జనవరి 3న ఐదుగురు నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. ఏదిఏమైనా స్త్రీ క్రూరంగా బలైందని చెప్పాలి, ఈ ఐదుగురు నేరస్థుల్లో ఒకరు (రామ్‌సింగ్) జైల్లోనే ఉరి వేసుకోగా మరొక మైనర్ నేరస్థుడు మహమ్మద్ అఫ్రోజ్ 3 సం॥ లు అతి తక్కువ జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు.
మిగిలిన నలుగురు నేరస్థులైన వినయ్, అక్షయ్ సింగ్, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా ఉరి తీయబడ్డారు. ఈ “నిర్భయ” కేసు స్త్రీ జన్మకే ఒక గొడ్డలి పెట్టు. అయితే నిర్భయ మరణించిన 7 సం॥లు తర్వాత 2020లో వారికి ఉరి శిక్ష అమలు జరిగింది. ఈ కేసు గురించి చెప్పుకుంటుండగానే మరెన్నో దారుణ సంఘటనలు పునరావృతం అయ్యాయి. 2013లో అంటే “నిర్భయ” జరిగిన కొన్ని నెలల వ్యవధిలోనే ఒక యువ జర్నలిస్టు 22 సం॥ ల అమ్మాయిని ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఉద్యోగస్థులను, విద్యార్థులను, సామాన్య స్త్రీలను వయో భేదం లేకుండా చిన్న వయసు ఆడపిల్లల్ని కూడా అత్యాచారం చేసి హింసించి వారి మరణాలకు కారణమవుతున్నారు.
ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినా నేరాల రేటును అమలు చేయలేని పరిస్థితే వుంది. అయితే ఈ కేసు ఇలా వుండగా యుపిలో 2014లో బదౌన్ జిల్లాలో మరో (యువతిపై) గ్యాంగ్ రేప్ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మైనర్ బాలికలు చెట్లకు వేలాడుతూ ఉరి తీయబడినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరిగిన పిదప వారిపై సామూహిక అత్యాచారం జరగలేదని తేల్చి, ఆ ఐగుగురు నిందితులను విడుదల చేశారు. ఈ కేసు జాతీయ, అంతర్జాతీయంగా కలకలం రేపింది. దీని వల్ల అంతర్జాతీయ అవమానాన్ని పొందకుండా నివేదికను తారుమారు చేశారని కొందరు అప్పట్లో భావించారు. 2015లో యుపిలో బజ్నార్ అనే జిల్లాలో కూలీ అయిన తన తండ్రి వెంట చెరకు పంట కోయడానికి తండ్రికి సహాయంగా వెళ్ళిన 16 సం॥ల బాలికను సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ నేరస్థులకు ఒక్కొక్కరికీ రూ. 30 వేలు జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించడమైనది.
ఆడ పిల్లలు స్వేచ్ఛగా బయటకు రావడం వారికి శాపమైపోతుంది. ఆడ పిల్లలు బయట కనపడితే మృగాల్లాగా మారి, వారి మరణాలకు కారణమై, వారిని మొగ్గలోనే తుంచి పారేస్తుంటే ఇక స్త్రీ జాతి అంతమైపోకుండా వుంటుందా? స్త్రీ లేకపోతే అమ్మ వుండదు. అమ్మ లేకపోతే మన మానవ జాతికి అంతం తప్ప అభివృద్ధి వుండదు. ఇది వాస్తవమని ఒప్పుకొనే వారెందరు? కొన్ని ప్రాంతాల్లో అయితే మరింత మృగత్వాన్ని, పశుత్వాన్ని చూపిస్తూ ఒక స్త్రీని గర్భవతి అని కూడా చూడకుండా సామూహిక అత్యాచారం చేసి క్రూరంగా చంపిన సంఘటన 2016లో అరియలూర్ అనే జిల్లాలో ఒక 17 సం॥ల దళిత యువతిని గర్భవతిని చేసి ఆమెను తన స్నేహితులతో కలిసి మరలా సామూహికంగా రేప్ చేసి, ఆమెను బ్లేడ్‌తో కోసి, చిత్రహింసలు పెట్టి, ఆమె చేతులూ, కాళ్ళు కట్టి ఆమె మృత దేహాన్ని బావిలో పడేసినట్లు ఆధారాలు దొరికాయి. ఈ కిరాతకానికి ఏ శిక్ష వేయాలి? ఒక 2018లో జమ్మూకశ్మీర్ సమీపంలో వున్న కతువా అనే ప్రాంతంలో ఆసిఫా బానో అనే 8 సం॥ల బాలికను ఆరుగురు పురుషులు ఒక మైనర్ బాలుడు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది.
ఆడపిల్లలకు అమాయకత్వం, పసితనం ఒక శాపమైతే కొన్ని సందర్భాలలో నమ్మకం, మంచితనం కూడా శాపంగా మారి బలియైన సంఘటనలు లేకపోలేదు. దీనికి ఉదాహరణే 2019లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య కేసు. చదువుకొని వెటర్నిటీ డాక్టర్‌గా చేస్తూ సమాజానికి సేవలందిస్తున్న డాక్టర్ ప్రియాంకా రెడ్డిని షాద్‌నగర్ ప్రాంతంలో నలుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారం చేసి, ఆమెను కాల్చి చంపేశారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ప్రజలంతా ఇళ్ళ నుండి బయటకు వచ్చి ఆమెకు న్యాయం చేయకపోతే ఎవ్వరూ రోడ్లపై నుండి కదిలేది లేదని ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ నిందితుల్ని వెంటనే ఎన్‌కౌంటర్ చేసిన పిదపప్రజాగ్రహం చల్లారిందని చెప్పాలి. అంటే ఆ స్థాయిలో ప్రజా స్పందన ఆ నేరస్థులకి తక్షణ శిక్షకు కారణమైందని, ఆ బాధితురాలికి న్యాయం జరిగిందని భావించినప్పటికీ ఆమె తల్లిదండ్రులను ఓదార్చే వారెవరు. అపురూపంగా పెంచుకున్న తమ బిడ్డను తెచ్చిచ్చేవారెవరు? ఆడపిల్లను కనడమే వారి నేరమా? లేక ఆడపిల్లగా పుట్టడమే ఆమె శాపమా? ఈ ప్రశ్నలకు సమాధానం వుందా? ఈ ఘటన జరిగి ఇంకా సమాజం ఊపిరి పీల్చుకోక ముందు 2020 సం॥లో యుపిలో హత్రాస్ అనే ప్రాంతం లో 19 సం॥ల దళిత మహిళ నలుగురు అగ్రవర్ణ పురుషులచే సామూహిక అత్యాచారానికి బలై రెండు వారాల తర్వాత ఆమె ఢిల్లీ ఆస్పత్రిలో మరణించింది.
ఇది దేశ వ్యాప్త సంచలనాన్ని సృష్టించింది. అయితే ఆమె తనను సామూహికంగా రేప్ చేసి బాధించినట్లు మరణ వాంగ్మూలంలో చెప్పినప్పటికీ ఎవ్వరినీ అరెస్టు చేయలేదని, తమ అనుమతి లేకుండానే ఆ యువతిని బలవంతంగా పోలీసులే దహనం చేశారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది దేశ వ్యాప్త ఖండనకు గురియైంది. ఎన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నా వయో పరిమితులు లేకుండా కుల మత విభేదాలు, ప్రాంతీయ విభేదాలు అన్న ప్రసక్తి లేకుండా నాన్ స్టాప్‌గా సాగిపోతున్నాయి. “ఈ మాన భంగ మారణ ఖాండలు”.
అభం, శుభం ఎరుగని పసిపాపను కూడా వదలని మృగ తృష్ణకు ఉదాహరణ ఇటీవల 2022లో హైదరాబాద్, బంజారాహిల్స్‌లో ఒక స్కూల్‌లో కిండెర్ గార్టెన్ విద్యార్థిపై కారు డ్రైవర్ లైంగిక వేధింపులు మనందరికీ ఎంతో జుగుప్స కలిగించడమేకాక, పసివాళ్ళను ఎలా కాపాడాలన్న భయం ప్రతి ఒక్కరిలోనూ రోజు రోజుకీ పెరుగుతూనే వుంది. ఇది వాస్తవం కాదా? ఇక లేటెస్టు విషయానికొస్తే నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం డాక్టర్ వైశాలి అనే యువతిని తల్లిదండ్రులు చూస్తుండగానే నవీర్ రెడ్డి అనే యువకుడు కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకెళ్ళి హింస పెట్టిన సంగతి మనం అన్ని ఛానళ్ళ ద్వారా చూశాము. అసలు వీటిపై వెంటనే తక్షణ చర్యలు చేపట్టి ఎంక్వైరీ చేసి శిక్షలు వెంటనే అమలు చేయకపోవడం వల్ల ఇవి ఒక దాని వెనుక మరొక సంఘటనలు అంతుపట్టని రీతిలో జరిగిపోతున్నాయి. సరైన విధానంతో పని చేసే యంత్రాంగం, తక్షణ శిక్షలు లేక జాప్యం జరగడం వల్ల నేరస్థులకు భయమనేది లేక ఎంతటి ఘోరానికైనా పాల్పడే ధైర్యం వారిలో దినదినాభివృద్ధి చెందుతుంది. నేరం జరిగిపోయాకా విచారణలో జాప్యం, శిక్షించడంలో ఆలస్యం, నిరూపణలో కాలయాపన వంటివి నేరస్థులకు ప్రోత్సాహకాలుగా మారాయి. సత్వర పరిష్కారం లేకపోవడం, కాలాతీతం వల్ల సాక్షాలు తారుమారు అయ్యే అవకాశాలు కూడా వుంటాయి.
ఇవన్నీ ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ఈ దుర్ఘటనలు జరిగిపోయాకా తీసుకునే చర్యలు, ప్రజాగ్రహం చల్లారని పక్షంలో ఒక కొత్త చట్టాన్ని రూపొందించడం మాత్రమే జరుగుతున్నాయి. విద్యావంతులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ, మారుమూల ప్రాంతాల వరకు కూడా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలి. ఎక్కడ ఏ ఘటన జరిగినా అందరూ స్పందించే విధంగా, మార్పు తీసుకురావాలి.అందరూ తమ తమ సొంత పనులను పక్కన పెట్టి సమాజమంతా ఈ వికృత చర్యల నిర్మూలనకై ఒకతాటిపై కదిలిన రోజున ఖచ్చితంగా మార్పు సాధిస్తాము. అదే విధంగా ఆడవారు తమను తాము రక్షించుకొనే విధంగా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుకోవాలి. బాలికలకూ, విద్యార్థులకూ మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి శిక్షణ ఇచ్చి వారి రక్షణకై కొత్త మార్గాలను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ వుండాలి.