హుబ్బలి: కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అయితే ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా నిర్ణయం జరగలేదని ఆయన చెప్పారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ రానున్న లోక్‌సభ ఎన్నికలలో పోటీచేయనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని చెప్పారు.
అయితే వారు కర్నాటక నుంచి పోటీ చేస్తారా లేక మరో రాష్ట్రం నుంచి పోటీ చేస్తారా అన్న విషయంపై ఇంకా నిర్ణయం జరగలేదని ఆయన వివరించారు. బెంగళూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఇంకా నిర్ణయమే జరగనప్పుడు తాను ఏం చెప్పగలనని ఆయన అన్నారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ కర్నాటక నుంచి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు.