Wednesday, January 22, 2025

కనిపించని సమధర్మం, సమతుల్యత

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి సమర్పించిన వార్షిక బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో సమతుల్యత లోపించినట్లు కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇబ్బడిముబ్బడిగా కేటాయింపులు జరుపుతూ, మిగిలిన రాష్ట్రాల పట్ల చిన్నచూపు చూశారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేకపోలేదనే భావన కలిగించేదిగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్రం, మిగిలిన కాలానికి పూర్తిస్థాయి పద్దును మంగళవారం సభ ముందు ఉంచింది. బడ్జెట్ అనేసరికి మధ్యతరగతి ప్రజానీకం పన్నుల్లో ఊరట కోసం ఎదురుచూడటం సహజం. తాజా బడ్జెట్లో వారికి కంటితుడుపుగా మాత్రమే ఊరట లభించింది. ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ మూడు కొత్త పథకాలకు తెరతీయడం ఈసారి బడ్జెట్లో చెప్పుకోదగిన అంశం. తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ఒక నెల వేతనం అందిస్తామని ప్రకటించడం సంఘటితరంగానికి శుభవార్త.

తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఉద్యోగులకూ, యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు ప్రకటించడం, 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా పథక రచన చేస్తామనడం కూడా స్వాగతించదగిన నిర్ణయాలే. యువతరంలో పెల్లుబుకుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాలకు రూపకల్పన జరిగి ఉండవచ్చు. పిఎం ఆవాస యోజన పథకంలో భాగంగా పట్టణ పేద, మధ్యతరగతి గృహావసరాల్ని తీర్చే విధంగా ఆర్థికసాయం అందజేతకు నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయం. ఉభయ తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, బడ్జెట్ కేటాయింపులు ఒక కంట ఆనంద బాష్పాలు కురిపించేవిగా, మరొక కంట కన్నీరు పెట్టించేవిగా ఉన్నాయని చెప్పాలి. ఎపి విభజన చట్టాన్ని గుర్తు పెట్టుకుని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు వరాలిచ్చిన కేంద్రం.. తెలంగాణకు మొండిచెయ్యి చూపించింది

కొన్ని నెలలుగా ఢిల్లీ చుట్టూ కాలికి బలపం కట్టుకుని తిరిగిన రేవంత్ రెడ్డి ప్రభృతుల డిమాండ్లను పెడచెవిన పెట్టినట్లు తాజా బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఆర్‌ఆర్‌ఆర్, బయ్యారం స్టీల్‌ఫ్యాక్టరీ, మెట్రో విస్తరణ తదితర ప్రాజెక్టులు బడ్జెట్లో ప్రస్తావనకు సైతం నోచుకోకపోవడం శోచనీయం. ఎపిలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న నిర్మలా సీతారామన్, తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల గురించి మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. రాష్ట్రం నుంచి బిజెపి ఎనిమిది పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడం, కేంద్రంలో ఇద్దరు మంత్రులు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూండటంతో ఈసారి రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో కేటాయింపులు ఉంటాయనుకున్నవారికి నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్‌లో ఏమాత్రం సహకారం లభించని నేపథ్యం లో ఆరు గ్యారెంటీల అమలు, మూసీ సుందరీకరణ, రుణమాఫీ వంటి పథకాల అమలు రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా పరిణమించనున్నాయని చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, మూడో విడత అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వానికి అకస్మాత్తుగా ఆ రాష్ట్రంపై ఎక్కడలేని అవ్యాజానురాగాలు పుట్టుకొచ్చాయి. గత పదేళ్లుగా ఏనాడూ పట్టని ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్యమైనవిగా కనిపించడం వింతల్లోకెల్లా వింత. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా, భవిష్యత్తులోనూ మరిన్ని నిధులు కేటాయిస్తామంటూ అభయం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రైతులకు పోలవరం ప్రాజెక్టును జీవనాడిగా అభివర్ణిస్తూ, దీన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరిస్తామని పేర్కొన్న కేంద్రంలోని పెద్దలకు ఈ జీవనాడి గత పదేళ్లుగా ఎందుకు గుర్తుకురాలేదన్నది ప్రశ్న.

కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకం కాబట్టే ఇలా వరాలజల్లు కురిపించారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంధ్రప్రదేశ్‌కే కాదు, సంకీర్ణలో మరో కీలక భాగస్వామి పార్టీగా ఉన్న జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ నాయకత్వంలోని బీహార్ పైనా కేంద్రం ఇదే ఉదార వైఖరిని కనబరిచింది. ప్రత్యేక హోదాకోసం పట్టుబడుతున్న నితీశ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు బీహార్‌లో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 26 వేల కోట్లు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి 21 వేల కోట్ల రూపాయలు, వరదల నియంత్రణకు రూ. 11.500 కోట్లు కేటాయించి ‘సంకీర్ణ ధర్మాని’కి మోడీ పెద్దపీట వేశారు. విభజనానంతరం వివిధ కారణాల వల్ల అభివృద్ధి విషయంలో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడం హర్షించదగిన పరిణామం. మరోవైపు, నిధుల కేటాయింపులో తెలంగాణకు మరోసారి నిరాశ మిగలడం శోచనీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News