చెన్నై: అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట ఎంతో వైభవంగా జరగనుండగా, ఆ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఆరోపించారు. తమిళనాడులో 200కు పైగా శ్రీరాముని ఆలయాలు ఉండగా, పూజా కార్యక్రమాలు కానీ, భజనలు కానీ, ప్రసాదం, అన్నదానం వంటి వాటికి ఆ రాష్ట్ర ప్రభుత్వ హెచ్‌ఆర్ అండ్ సిఇ ( హిందూ రెలీజియస్, అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ ) మంత్రిత్వ శాఖ అనుమతించడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమాలను నిర్వహించకుండా పోలీస్‌లు అడ్డుకుంటున్నారని , మండపాలను కూల్చి వేస్తామని నిర్వాహకులను బెదిరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి హిందూ వ్యతిరేక చర్యలను ద్వేషాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సీతారామన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
స్థానిక మీడియా కథనాలను తన ట్వీట్‌కు జోడించారు. ఇండియా కూటమిలో డిఎంకె భాగస్వామి కావడం వల్లనే ఇలా జరుగుతోందని ఆరోపించారు. నిర్మలా సీతారామన్ చేసిన ఆరోపణలను తమిళనాడు ప్రభుత్వం ఖండించింది. ఈ సందర్భంగా హెచ్‌ఆర్ అండ్ సీఈ మంత్రి పీకే శేఖర్ బాబు మాట్లాడుతూ , నిర్మలా సీతారామన్ వంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం విచారకరమని విమర్శించారు. రాముని పేరిట ప్రత్యేక పూజలు, అన్నదానం లేదా ప్రసాదం పంపిణీ చేయడంపై ఎలాంటి నిషేధం విధించలేదని వివరించారు. సేలంలో డిఎంకె యువజన విభాగం సదస్సు ప్రస్తుతం జరుగుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ధ్వజమెత్తారు.