Monday, December 23, 2024

ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్:నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, విచక్షణారహితంగా రెవిన్యూ వ్యయం, భారీ ఎత్తున బడ్జెట్‌కు వెలుపల అప్పులు చేయడం, బ్యాంకుల్లో మొండి బకాయిలు పెద్ద ఎత్తున పేరుకు పోవడం లాంటి చర్యల ద్వారా తమ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను నిస్తేజంగా మార్చిందని ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పేర్కొంది. యుపిఎ ప్రభుత్వంతో పోలిస్తే రాజకీయంగా, విధానపరంగా ఎన్‌డిఎ ప్రభుత్వం స్థిరంగా ఉందని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కఠినమైన నిర్ణయాలను తీసుకుందని కేంద్రం వెల్లడించింది. దేశ ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. గత యుపిఎ ప్రభుత్వంతో పోలిస్తే తమ పదేళ్ల పాలనలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో 54 పేజీల ఆ పత్రంలో వివరించారు.

దీనిపై శుక్రవారం సభలో చర్చించనున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు జరగనున్న చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు.‘ ఆర్థికపరంగా 2014 వరకు ఎక్కడ ఉన్నాం.. ఇప్పుడు ఏ స్థాయికి చేరుకున్నాం అని తెలుసుకోవడానికి ఇది సరైన సమయం.గత ప్రభుత్వాల పాలనలో లోపాలనుంచి పాఠాలు నేర్చుకుని వృద్ధి దిశగా ఎలా పయనిస్తున్నామో చెప్పడమే మా ఉద్దేశం.అందుకే ఈ శ్వేతపత్రాన్ని సభ ముందుకు తీసుకువచ్చాం’ అని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాల్లో మోడీ ప్రభుత్వం ఈ శ్వేతపత్రాన్ని తీసుకు రావడం గమనార్హం. ఎన్నికల్లో ప్రతిపక్షాల మీద దాడికి బిజెపి, దాని మిత్రపక్షాలు దీన్ని మరో అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అయిదో స్థానానికి ఎలా తీసుకు వచ్చిందో, పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా దేశాన్ని ఎలాతీర్చిదిద్దిందో ఈ శ్వేతపత్రంలో వివరించారు.

శ్వేతపత్రంలో కీలకాంశాలు

‘2004లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం వృద్ధి రేటుతో పయనించింది. అలాంటిది పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యస్థను కాంగ్రెస్ ఛిన్నాభిన్నం చేసింది. మునుపటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్థిక సరళీకరణను యుపిఎ తుంగలో తొక్కింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ప్రభుత్వ ఆస్తులను చిన్నచూపు చూసి స్థూల ఆర్థిక పునాదులను దెబ్బతీసింది.యుపిఎ హయాంలో ఆస్పత్రి ఖర్చులు ప్రజలకు భారమయ్యాయి. 2014లో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. గత యుపిఎ ప్రభుత్వం వారి పరిపాలనలో ఆర్థిక వ్యవస్థను అచేతన స్థితిలో ఉంచింది. విదేశీ ద్రవ్య నిల్వలు అడుగంటి చెల్లింపుల సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉండింది.

అయితే యుపిఎ ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కఠిన నిర్ణయాలు తీసుకొంది.దీర్ఘకాల ప్రయోజనాల కోసం కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో యుపిఎ ప్రభుత్వం ఘోరంగా విఫలమయింది. ఆర్థిక వృద్ధిని అడ్డుకునేందుకు అడ్డంకులు సృష్టించింది. వారు వదిలేసిన సమస్యలను ఈ పదేళ్ల కాలంలో మేము విజయవంతంగా అధిగమించాం. మోడీ హయాంలో ఆర్థిక నిర్వహణ దేశాన్ని ఆర్థిక వృద్ధికి స్థిరమైన మార్గంలో నడిపిస్తోంది’ అని శ్వేతపత్రం పేర్కొంది. కాగా యుపిఎ హయాలో చోటు చేసుకున్న బొగ్గు క్షేత్రాల కేటాయింపులు, 2జి స్పెక్ట్రం వేలం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, శారదా చిట్‌ఫండ్‌లాంటి 15 కుంభకోణాలను ఉదహరిస్తూ, ఈ అవినీతి కేసులు దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని చెదిరేలా చేసిందని శ్వేతపత్రం పేర్కొంది.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News