మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు
నేడు, రేపు పలు జిల్లాలో వానలు పడే అవకాశం
నగరంలో రానున్న మూడురోజులు వానలు…
మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదేవిధంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో మూడు రోజులపాటు అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అధికారులు మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రహదారుపై ఎక్కడ నీరు నిలువకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవగా, హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యింది.
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన….
మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్‌మల్కాజిగిరిలో 91.5 మిల్లీమీటర్ల వర్షపాతం, కామారెడ్డిలో 83, ఖమ్మంలో 76.5, మహబూబాబాద్‌లో 61, సంగారెడ్డిలో 58.8, నాగర్‌కర్నూల్‌లో 57, రంగారెడ్డిలో 54.3, సూర్యాపేటలో 50, హైదరాబాద్‌లో 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది.