Monday, November 25, 2024

మరో 40గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

మరో 40గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు
తీవ్ర తుపాన్‌గా బిఫోర్‌జాయ్
తీర ప్రాంతాలు అప్రమత్తం
భారత వాతావరణ కేంద్రం వెల్లడి
భారత వాతావరణ విభాగం దేశ ప్రజలకు చల్లటి కబురందించింది. మరో 40గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళరాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది రుతుపవనాల రాక జాప్యంతో భగ్గుమంటున్న ఎండలు వడగాల్పులతో ఉడికి పోతున్న ప్రజలకు రుతుపవనాల రాక పెద్ద ఊరటనిస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన బిఫోర్‌జాయ్ తుపాను కారణంగా ఆలస్యం కావొచ్చనే అంచనాలు వినిపిస్తున్న తరుణంలో భారత వాతావరణ శాఖ స్పందించింది. మరో 40గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. రుతుపవనాల రాకకు దక్షిణ అరేబియా సముద్రం ,లక్షద్వీప్ , వాయువ్య , ఈశాన్య బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రానున్న 40గంటల్లో ఇవి తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతకుముందు రుతుపవనాల రాకలో జాప్యం జరిగేందుకు అవకాశం ఉందని ప్రవేటు వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ అంచాన వేసింది.

నైరుతి రుతుపవనాల రాక ఇప్పటికే ఏడు రోజులు ఆలసమైంది. ఇప్పడు ఆరేబియా సముద్రంలో ఏర్పడిన బిఫోర్ జాయ్ తుపాను కారణంగా ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని స్కైమెట్ సంస్థ వెల్లడించింది. గత ఏడాది జూన్ ఒకటినే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఏడాది అదే తేదినాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పులు కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. తొలుత జూన్ 4న కేరళ తీరాన్ని తాకవచ్చని ఐఎండి అంచనా వేసింది. వారం రోజులు గడిచినా రుతుపవనాల ఆచూకి అంతస్పష్టంగా కనిపించలేదు. తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్టు వాతావరణ నిపుణుల పేర్కొన్నారు. రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలం వర్షపాతం 5శాతం వరకూ తగ్గవచ్చని అంచనా వేశారు.

తీవ్ర తుపాన్‌గా బిఫోర్ జాయ్ ..తీర ప్రాంతాలు అప్రమత్తం:
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిఫోర్‌జాయ్ తుపాను వేగంగా బల పడుతూ వస్తోంది. ఇది తీవ్ర తుపానుగా మారి బుధవారం ఉదయం 5.30గంటలకు గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన నైరుతి ప్రాంతంలో, ముంబాయికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో నైరుతిలో, పోర్‌బందర్‌కు 1070 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన నైరుతిలో, కరాచీకి 1370 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన కేంద్రీకృతమైవ ఉంది. రాగల మూడు రోజుల్లో ఇది ఉత్తరాన వాయువ్య దిశలో కదిలే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను కారణంగా అరేబియా తీర ప్రాంతాలకు ఎటువంటి పెనుముప్పు లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యలుగా సముద్ర తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. సముద్రంలోకి చేపల వేటకు ఎవరూ వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణకు మరో మూడు రోజలు వర్షాలే
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ చత్తిస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం బుధవారం బలహీన పడింది.ద్రోణి ఉత్తర చత్తీస్‌గడ్ నుండి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకూ సగటు సముద్రమట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూవుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన 24గంటలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మొగలిగిద్దలో 69.8మి.మి వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా నాంపల్లిలో 53.8, బంత్వారంలో 51.5, దామరగిద్దలో 39.8, ధరూర్‌లో 39.3, గణపూర్‌లో 32.5, జానంపేటలో 30, కోటిపల్లిలో 29.5, నందనంలో 29, పరిగిలో 13, వెల్టూరులో 21.8, షాద్‌నగర్‌లో 21.5, మన్నెగూడలో 19, పెద్దమందడిలోఎ 16,కశీంపూర్‌లో 15 మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి.

మరోవైపు రాగల మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాలలో వడగాలుల వీచే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. ఖమ్మం ,నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్ ,కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలోని తంగులలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లో కూడా 45డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. మేడారంలో 45.5, దామరచర్లలో 45.3, మహదేవ్‌పూర్‌లో 45.1, తాడ్వాయ్‌లో 45.1, కెరిమెరిలో 45.1, మునగాలలో 45.1, యానాంబైలులో 45.1, కేతిపల్లిలో 45, జంబుగలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News