Monday, December 23, 2024

ఒక్కడినే రమ్మన్నారు.. అయోధ్య ప్రతిష్ట ఘట్టానికి వెళ్లను

- Advertisement -
- Advertisement -

పూరీ మఠాధిపతి నిశ్చలానంద స్వామి వెల్లడి
మోడీకి పొగడ్తలు ..సంప్రదాయంపై చురకలు
పరిధికి మించి సలహాలు ఇవ్వలేమని స్పందన

భోపాల్ : ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామి ఆలయ మఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి తాను అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట ఘట్టానికి హాజరుకావడం లేదని తెలిపారు. పూరీ గోవర్థన పీఠంశంకరాచార్య అయిన నిశ్చలానంద శుక్రవారం ఈ ప్రకటన వెలువరించారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో బ్రహ్మండ రీతిలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. దీనికి పలు రంగాలకు చెందిన ప్రముఖులకు రామజన్మభూమి ధర్మకర్తల మండలి తరఫున ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. తనకు కూడా సంబంధిత ఆహ్వానం అందిందని, అయితే ఇందులో ఈ కార్యక్రమానికి తాను ఒక్కరే రావాలని పేర్కొన్నారని, రావాలనుకుంటే ఒక్కరే రావచ్చునని తెలిపారని ఈ స్వామి వివరించారు.

మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ పట్టణంలో సనాతన ధర్మ సభలో పాల్గొనడానికి వచ్చిన దశలో ఆయన జర్నలిస్టులతో మాట్లాడారు. ఆదిశంకరచార్య స్థాపించిన దేశంలోని నాలుగు మఠాలలో పూరీ మఠం కూడా ఒకటి. ఒంటరిగా రావాలని తనకు ఆహ్వానం అందిందని, ఒకవేళ తనకు వంద మందితో రావచ్చునని పిలిచినా ఆ రోజున తాను అక్కడికి వెళ్లలేనని కూడా వివరణ ఇచ్చారు. తాను శ్రీరామభక్తుడిని అని, ఇంతకు ముందు వెళ్లానని, ఈ మతపరమైన పట్టణానికి ఇక ముందు కూడా వెళ్లుతూనే ఉంటానని వివరించారు.

శతాబ్ధాలుగా ఆగిపోయి ఉన్న ఘట్టం తిరిగి ఇప్పుడు ఆరంభం కాబోవడం సంతోషకరం అన్నారు. ఏది ఏమైనా శ్రీరాముడి విగ్రహం అయోధ్య దేవాలయంలో శాస్త్రీయ విధివిధానాల నడుమ సాగాల్సి ఉంటుందన్నారు. ఇక తమ గోవర్థన పీఠం లేదా మఠం పరిధి కేవలం ప్రయాగవరకూ ఉందని, దీనిని మించి తాము ఇతర చోట్ల జరిగే క్రతువుల విషయంలో సలహాలు ఇవ్వలేం, జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. అంతేకాకుండా రామ ప్రతిష్టాపనకు సంబంధించి ఇంతవరకూ తమను ఎవరూ కూడా అధికారికంగా సంప్రదించలేదని వివరించారు. రావాలని పిలిచారు. వెళ్లలేనని ఇక అడగకుండా ప్రతిష్టాపన విధివిధానాలను చెప్పలేనని స్పష్టం చేశారు.

ప్రధాని మోడీ ఇతరులలా కుహనలౌకికవాది కాదు
అయోధ్య ప్రతిష్టాపనపై తనకు ఎటువంటి అసంతృప్తి లేదని పూరీ స్వామి తెలిపారు. ఇతర సనాతన హిందువుల మాదిరిగానే తాను అయోధ్య ఘట్టంపై సంతోషిస్తున్నానని వివరించారు. తనకు తాను గొప్ప లౌకికవాదినని మోడీ కపటాలకు వెళ్లలేదు. పైగా ఆయన హిందూత్వను గర్వకారణంగా భావించుకుంటారు. అదే విధంగా విగ్రహారాధనకు పట్టం కడుతారు. పిరికివాడు కారు. సెక్యులర్ ముసుగు ఆయనకు నచ్చదు.

మోడీ అయోధ్య విగ్రహాన్ని తాకితే చప్పట్లు చరిచి చూడాలా ?
అయోధ్యలో రామ విగ్రహాన్ని మోడీ ద్వారా ప్రతిష్టింపచేయడాన్ని ఈ స్వామిజీ వ్యతిరేకించారు. అయితే నేరుగా ఈ విషయం చెప్పలేదు. తాను అయోధ్యకు ఆరోజున , ప్రతిష్టాపన ఘట్టం దశలో ఓ శంకరచార్యగా ఉండి ప్రధాని మోడీజీ రామ విగ్రహాన్ని తాకి, ప్రతిష్టిస్తే తాను చప్పట్లు చరిచి కొనియాడాలా? అని నిలదీశారు. ప్రధాని మోడీ తనను ప్రధాని బాధ్యతలు తీసుకోవడానికి ముందు కలిశారని, ఇక యుపి సిఎం ఆదిత్యానాథ్ పలు సార్లు సందర్శించుకుంటారని, , ఇక విహెచ్‌పి మాజీ అధినేత , దివంగత అశోక్ సింఘాల్ తనను ఓ 70 సార్లు కలిసి ఉంటారని తెలిపారు.

తీర్థస్థలాలు పర్యాటక వాణిజ్య కేంద్రాలైతే అనుచితమే
ప్రగతి పరిసరాల సరికొత్త అందాల పేరిట దేశంలో పలు చోట్ల యాత్రాస్థలాలు లేదా ఆధ్యాత్మిక కేంద్రాలు పర్యాటక విడిదిలు అవుతున్నాయని పూరీ స్వామి తెలిపారు. తీర్థస్థలిలు క్రమేపీ భోగస్థలిలు, కాలక్షేప విడిదిలు కావడం ఇప్పటి పరిణామం అన్నారు. అయితే ఈ పరిణామాన్ని కొందరు పెద్దలు దేశం ప్రగతి బాటలో సాగుతుందని ముక్తాయింపులతో ముడిపెడుతున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News