Tuesday, December 3, 2024

నిత్యానంద లోకం యుఎన్ఓలో ప్రత్యక్షం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: వివిధప్రపంచదేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టానికి ఏర్పడిన ఐక్య రాజ్య సమితి(యుఎన్‌ఓ) అపహాస్యం పాలవుతోంది. భారత్‌లో బాలికలపై అత్యాచారం, లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పరారై తనకు తానుగా సృష్టించుకున్న కైలాస దేశంలో తలదాచుకున్న నిత్యానంద అంతర్జాతీయ వేదికను తాజాగా వాడుకునే ప్రయత్నం చేయడం విశేషం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు ప్రధాన పీఠాధిపతిగా చెప్పుకునే నిద్యానందకు భారత్ నుంచి ముప్పు ఎదురవుతోందని, ఆయనను ప్రపంచ దేశాలు రక్షించాలని ఐక్య రాజ్య సమితిలో ఆ దేశానికి ప్రతినిధినని చెప్పుకుంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఫిబ్రవరి 22న యుఎన్‌ఓ సమావేశంలో ప్రత్యక్షమైంది.

భారత్‌లో అనేక చోట్ల ఆశ్రమాలను నడుపుతున్న స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై గుజరాత్ పోలీసులు ఆశ్రమంలో బాలికను కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదు చేశారు. దీంతో 2019లో నిత్యానంద దేశం నుంచి పరారయ్యాడు. అంతుచిక్కని ప్రదేశంలో కైలాస దేశం స్థాపించినట్లు నిత్యానంద అప్పట్లో ప్రకటించాడు. తన దేశానికి సొంత కరెన్సీ ఉందంటూ కూడా చెప్పుకున్నాడు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస తరఫున ఒక మహిళ యుఎన్‌ఓ సమావేశంలో పాల్గొనడమేకాక తమ దేశాధిపతి నిత్యానంద భారత్ నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నట్లు చెప్పడం, ఆయనకు ప్రపంచ దేశాలు రక్షణ ఇవ్వాలని కోరడం చర్చనీయాంశమైంది. అసలు నిత్యానంద సృష్టించిన దేశాన్ని యుఎన్‌ఓ గుర్తించిందా, గుర్తించిన పక్షంలో నిత్యానందను ఆ దేశానికి రాజుగా ప్రకటించేందుకు ఏ విధమైన ప్రక్రియను పాటించిందన్నది తెలియవలసిన అవసరం ఉంది.

ఫిబ్రవరి 22న జరిగిన యుఎన్‌ఓ ఆర్థిక, సామాజిక,సాసంస్కృతిక హక్కుల(సిఇఎస్‌ఆర్) కమిటీ సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస తరఫున యుఎన్‌ఓ శాశ్వత ప్రతినిధిగా పాల్గొన్న విజయప్రియ నిత్యానంద సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి మాట్లాడారు. దీనికి, హిందూత్వానికి లంకె పెడుతూ హిందూ నాగరికత పునరుద్ధరణ కోసం కృషి చేస్తున్న నిత్యానందకు భారత్ నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. నిత్యానందను వేధించడం ద్వారా భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ కూడా ఆరోపించారు. 150 దేశాలలో దౌత్య కార్యాలయాలను, ఎన్‌జిఓలను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస స్థాపించినట్లు ఆమె చెప్పారు. తమ దేశంలో 20 లక్షల మంది హిందువులు నివసిస్తున్నట్లు కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఆమె ప్రపంగానికి చెందిన వీడియో యుఎన్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌లో దర్శనమివ్వడం గమనార్హం. మొత్తమ్మీద నిత్యానంద కాల్పనిక సృష్టి కైలాస ఇప్పుడు యుఎన్‌ఓలో ప్రత్యక్షం కావడం విశేషంగానే చెప్పుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News