Saturday, December 21, 2024

ఆవిష్కరణల పనితీరులో మనమే టాప్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నూతన ఆవిష్కరణలలో మరో రికార్డును తెలంగాణ సాధించింది. ఆవిష్కరణలు, ఐటితో సహా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. గురువారం కేంద్ర ప్రభుత్వ మేధో సంస్థ నీతి ఆయోగ్ విడుదల చేసిన మూడో ఎడిషన్ ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో పర్ఫార్మర్స్ సూచికలో తెలంగాణ 15.24 అగ్ర స్థానంలో నిలువగా, కర్నాటక 14.02తో రెండో స్థానం, తమిళనాడు 12.45తో మూడో స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ సభ్యులు వి.కె. సారస్వత్, సిఈఓ పరమేశ్వరన్, సీనియర్ సలహాదారు నీరజ్ సిన్హా ఆధ్వర్యంలో సంస్థ వైస్ చైర్మన్ సుమన్ బేరీ ఈ సూచికలను విడుదల చేశారు. దేశవ్యాప్తం గా ఆవిష్కరణల పనితీరుతో తెలంగాణ రా్రష్ట్రం అగ్రగామిగా నిలిచింది. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఐటి శాఖ మంత్రి కెటిఆర్ విజన్‌తో ఇన్నోవేషన్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. యావత్ తెలంగాణ రాష్ట్రం గర్వించదగ్గ అంశం. ఏనిమిదేళ్ల క్రితం ఆవిర్భవించిన కొత్త రాష్ట్రం తెలంగాణ ఐటి, తో సహా అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. ఇది తెలంగాణా ప్రభుత్వ పని తీరుకు లభించిన పురస్కారం. బహుళ జాతీ కంపెనీల ఏర్పాటుతో అగ్రశ్రేణి ఐటి కేంద్రంగా, స్టార్టప్‌లతో తెలంగాణ సాధించిన ఘనత. తెలంగాణ రాష్ట్రం ఐటిలో మంచి పనితీరును కనబరిచింది. రాష్ట్రంలోని ఐసిటి ల్యాబ్‌లు ఉన్న పాఠశాలల శాతం దాదాపు 17 శాతం నుం చి 35 శాతానికి పెరిగాయి. ఉన్నత విద్యాపరంగా, నమోదుల సంఖ్య (లక్ష జనాభాకు) కూడా దాదాపు 9.7 నుంచి దాదాపు 15.7కి పెరిగింది. ప్రైవేట్ పరిశోధన, అభివృద్ధి యూనిట్ల సంఖ్య (లక్ష జనాభాకు) 0.3 నుంచి దాదాపు 1.4కి పెరగడంతో నైపుణ్య కార్మికులను సృష్టించింది. దీంతో పాటు పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, ఇండస్ట్రియల్ డిజైన్‌తో సహా నాలెడ్జ్ అవుట్‌పుట్ స్తంభాలలో రాష్ట్రం మంచి పనితీరు కనబరిచింది. గతేడాదితో పోల్చితే దాని స్టార్టప్‌లను సుమారు 4,900 నుంచి 9వేలకు పెంచడమే కాకుండా, ఫైల్ యూనిట్లలో పెరుగుదలలో ఉంది. దేశవ్యాప్తంగా నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లలో వివిధ రాష్ట్రాల పనితీరును తెలియజేసే ఈ సూచికలను ప్రతి సంవత్సరం నీతి ఆయోగ్, ఇన్సిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ కలిసి సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ తరహాలో ఈ సూచీని రూపొందించారు. ఈ సూచీని బట్టి ఆయా ప్రాంతాల్లో కొత్త ఆవిష్కరణలకు ఉన్న అనుకూలతలు, సవాళ్లను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఫలితంగా జాతీయ స్థాయిలో సమగ్ర విధాన రూపకల్పనకు అవకాశం ఏర్పడుతుంది.
దేశవ్యాప్త సూచికల్లో రెండో స్థానం..
నీతి ఆయోగ్ విడుదల చేసిన మూడో ఎడిషన్ ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో దేశవ్యాప్తంగా తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కర్ణాటక తొలి స్థానంలో నిలువగా.. హరియాణా మూడో ర్యాంకులో ఉంది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కర్ణాటక తొలిస్థానంలో నిలువగా.. ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాల్లో మణిపూర్, కేంద్రపాలిత ప్రాంతాలు, సిటి స్టేట్స్ కేటగిరీలో చండీగఢ్ అగ్రస్థానంలో నిలిచాయి. జాతీయ స్థాయిలో ఆవిష్కరణలకు కావాల్సిన సామర్థ్యం, వాతావరణం ఎలా ఉందో గమనించి ఈ ర్యాంకులను ప్రకటిస్తారు. 17 ప్రధాన రాష్ట్రాలు, 10 ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు, సిటీ స్టేట్స్‌గా విభజించారు. ఈ సూచీలో వరుసగా మూడో సంవత్సరం కర్ణాటక ప్రథమ స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్ ఈ సూచీలో ప్రధాన రాష్ట్రాల్లో అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. నీతి ఆయోగ్ సిఈఓ పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ దేశంలో స్టార్టప్‌ల పరిస్థితిని పర్యవేక్షించేందుకు నీతి ఆయోగ్ నిరంతరం కట్టుబడి ఉందన్నారు. నూతన ఆవిష్కరణల సృష్టికి అవకాశం కల్పించే వాతావరణం అభివృద్ధి పరచేందుకు తాము నిరంతరం కృషి చేస్తామన్నారు. 2019 అక్టోబరులో మొదటి ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను, 2021 జనవరిలో రెండో ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను, తాజాగా మూడో ఇండెక్స్ విడుదల చేశారు.
అన్ని రంగాల్లో తెలంగాణ పురోగతి: వినోద్‌కుమార్
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఐటి శాఖ మంత్రి కెటిఆర్ విజన్‌తో ఇన్నోవేషన్‌లో దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో పురోగతిలో నిలిపిన సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

NITI Aayog announced Telangana 2nd in Innovation Index

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News